అడుగు జాడలు
వంద సంవత్సరాల క్రితం...ఆర్కిటెక్చర్ రంగంలో పురుషులతో పోల్చితే మహిళలకు సమాన అవకాశాలు లేని రోజుల్లో ఆర్కిటెక్ట్‌గా సత్తా చాటారు అన్నా వాగ్నర్ కీచ్‌లైన్. పెన్సిల్వేనియాలో ఆర్కిటెక్ట్‌గా లైసెన్స్ పొందిన తొలి మహిళ వాగ్నర్.
ఇంజినీరింగ్‌కు తనదైన సృజనాత్మకత జోడించారు. ఆమె ఆవిష్కరణలు భవనాలు అందంగా కనిపించడం గురించి మాత్రమే కాదు నిర్మాణ ఖర్చులను తగ్గించడం గురించి కూడా. ఈరోజుల్లో ‘తక్కువ ఖర్చుతో ఎలా భవనాలు నిర్మించాలి?’ అని వినూత్న ఆలోచనలు చేస్తున్నవారికి ఆనాటి ఆమె ఆవిష్కరణలు మార్గదర్శకంగా నిలిచాయి.
వాగ్నర్ ఆవిష్కరణలు ఇప్పటికీ ఆధునికంగా కనిపించడం విశేషం. పురుషాధిపత్య రంగంలోకి వాగ్నర్ అడుగు పెట్టిన వంద సంవత్సరాల తరువాత కూడా ఆమె వారసత్వం ఎక్కడో ఒకచోట ప్రతిఫలిస్తోంది. డిజైన్, నిర్మాణరంగాలలో కెరీర్‌ను వెదుక్కోవాలనుకునే యువతులకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంది. అద్భుతమైన ఆవిష్కరణలు ఆకాశం నుంచి పుట్టవని, రోజువారీ సమస్యలను పరిష్కరించుకోవడంతోనే పుడతాయని ఆమె జీవితకథ చెప్పకనే చెబుతుంది.


