అహంభావం | Intelligence is not the exclusive property of any one person | Sakshi
Sakshi News home page

అహంభావం

Nov 2 2026 4:19 AM | Updated on Nov 2 2026 4:19 AM

Intelligence is not the exclusive property of any one person

తాత్త్వికథ

ఒక పెద్ద పట్టణంలోని ఓ సివిల్‌ ఇంజనీర్‌కి తన కొడుకుని ఆర్కిటెక్ట్‌ చేయాలని కోరిక. తండ్రి ఆలోచనకు అనుగుణంగానే కొడుకు ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాడు. కోర్సు పూర్తవగానే రద్దీగా ఉండే కూడలిలో సొంతంగా ఆఫీసు ప్రారంభించాడు. బాగా డబ్బున్నవారు, నగరంలోని ప్రముఖ వ్యక్తులు కూడా అతడి సేవలను వినియోగించుకోవడం ప్రారంభించారు.

గొప్ప వ్యక్తుల పరిచయాలు, ఆదాయం పెరగడంతో ఆర్కిటెక్ట్‌కి అహంకారం పెరిగింది. ‘నన్ను మించినవాడు లేడు, నేను చాలా గొప్పవాడిని’ అనే భ్రమలో ఉండసాగాడు. కొడుకులోని ఈ ప్రతికూల వైఖరిని గమనించాడు తండ్రి. సమయం వచ్చినప్పుడు అతడికి కొన్ని మంచి బుద్ధిమాటలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఒకసారి కుటుంబసమేతంగా వారు హంపికి వెళ్ళారు. హంపిలోని ప్రసిద్ధ విరూపాక్షేశ్వర ఆలయ దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అయ్యాక, ఆలయ ప్రాంగణం వెనుక వైపు ఉన్న ఒక చీకటి గది వద్దకు వెళ్ళారు.

ఆ చీకటి గది గోడపైన విరూపాక్షేశ్వరాలయం ప్రధాన రాజగోపురం నీడ తలకిందులుగా పడి ఉంది. జనమంతా దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడే ఉన్న టూరిస్ట్‌ గైడ్‌ , ‘దీన్ని ఫిజిక్స్‌ లో ‘పిన్‌ హోల్‌ కెమెరా’ అంటారు. కాంతి ఎప్పుడూ సూటిగానే ప్రయాణిస్తుంది. గోపురం పైనుంచి వచ్చే కాంతి వెలుగు, చిన్న కన్నం గుండా వచ్చి గోడ కింద పడుతుంది. అలాగే గోపురం కిందనుంచి వచ్చే వెలుగు పైన పడుతుంది. అందుకే గోడమీద రాజగోపురం తలకిందులుగా కనిపిస్తుంది’ అని చెప్పాడు.

ఆ తలకిందుల ప్రతిబింబాన్ని కొడుక్కి చూపిస్తూ తండ్రి, ‘‘శతాబ్దాల క్రితం  విజయనగర చక్రవర్తుల కాలంలో నిర్మించిన అద్భుత నిర్మాణం ఇది. ఏమాత్రం సాంకేతిక సదుపాయాలు లేని రోజులవి. ఆధునిక సాంకేతిక సహకారంతో చిన్న చిన్న నిర్మాణాలు చేసి, మనల్ని మనమే గొప్ప అనుకుంటున్నాము. వారితో పోలిస్తే మనమెంత?’’ అని అన్నాడు.

తండ్రి మాటల్లోని ఆంతర్యం ఆర్కిటెక్ట్‌కి అర్థమయ్యింది. చిన్నగా తల వంచుకున్నాడు. ‘నిజమే, తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడుంటాడు. చెట్టు పైకి పెరిగే కొద్దీ తన వేళ్ళను మరిచిపోరాదు. మన పూర్వీకుల శాస్త్రీయ పరిజ్ఞానం, నైపుణ్యం ఎంతో గొప్పవి’ అని తెలుసుకున్నాడు. అనంతరం వారు గుడి బయటికి వచ్చి విరూపాక్ష స్వామికి, ఆ శిల్పకళా నిపుణులకు సాష్టాంగ నమస్కారం చేసి తమ ఈ హంపి యాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement