భారత విజ్ఞానం
పాండవుల ధర్మపత్ని ద్రౌపదికి నిండు సభలో అవమానకరంగా వస్త్రాపహరణం ఎందుకు జరిగింది? జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ మినహా పాండవులతో సహా కౌరవ సభలో కొలువుదీరిన అతిరథ మహారథులు సైతం ఎందుకు మౌనం దాల్చారు? అందుకు కారణం ఏమిటి? పూర్వజన్మ శాపమా? లేక కర్మ ఫలమా.. అంటే ఈ రెండూ అని చెప్పవచ్చు. అసలు తనకు ఇంత పరాభవం ఎందుకు జరిగిందని ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మను అడిగినపుడు పూర్వజన్మలోని ఒక పతివ్రత ఇచ్చిన శాపంతోపాటు, కర్మ సిద్ధాంతమే కారణమని శ్రీ కృష్ణుడు సమాధానమిచ్చాడు.
యుగాలలో మొదటిదైన కృత (సత్య) యుగం ముగిసింది. త్రేతాయుగం ప్రారంభమైంది. ఆర్యవటానికి ఉత్తర దిక్కున సువర్ణపురం రాజ్యాన్ని వీరభద్రుడనే మహారాజు పాలించేవాడు. ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. ధర్మనిరతతో రాజ్యాన్ని పాలిస్తూ అందరి ప్రశంసలు పొందాడు. ఆయన కుమార్తె దేవిక గొప్ప శివ భక్తురాలు. ఆమె రాజకుమారి కావడంతో ఖరీదైన పట్టువస్త్రాలు ధరించేది. అయితే కొద్దిపాటి అహంకారం గర్వం కూడా ఉన్నాయి. అందుకే ఆమె రాజ్యంలో ఉన్న పేదవారిని వారు కట్టుకున్న వస్త్రాలను చూసి ఎగతాళి చేసేది.
సువర్ణపుర రాజ్యానికి దూరంగా ఉన్న అడవిలో ఉగ్రశ్రవుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన భార్య సుశీలాదేవి. ఆమె మహా సాధ్వి. వృద్ధాప్యంతో పాటు ముని భార్య కావడంతో ఆమె పాత నార చీరలు ధరించేది. ఒకరోజు ఆమె మంచినీటి కోసం కుండ చేత పట్టుకుని దగ్గరలో ఉన్న నది వద్దకు వెళుతుండగా కాలికి రాయి తగిలి, పక్కనే ఉన్న ముళ్లపొదపై పడిపోయింది. ఆమె చీర ముళ్లలో చిక్కుకొని పోవడంతో దానిని తీసుకునే క్రమంలో చీర పూర్తిగా చిరిగిపోయింది.
దాంతో ఆమె సాయం చేయవలసిందిగా ఆర్తనాదాలు చేసింది. అదే సమయంలో తన ఐదుగురు చెలికత్తెలతో నదిలో జలకాలాడేందుకు వచ్చిన రాజకుమారి దేవిక సుశీలాదేవి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ‘‘నీలాంటి పేదదానికి మానం కాపాడుకోవడానికి నాలాంటి ధనవంతులైన రాజకుమారి పట్టువస్త్రాలు కావాలా... అవసరమైతే అడవిలో ఉన్న ఆకులను చుట్టుకొని ఇంటికి వెళ్ళు’’ అని నవ్వుతూ తీవ్రంగా పరిహాసం చేంది. రాజకుమారి మాటలకు ఐదుగురి చెలికత్తెలు పగలబడి నవ్వారు.
ఆగ్రహించిన సుశీలాదేవి ‘ఇలాంటి పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు. సాటిమహిళగా సాయం చేయడానికి బదులు హేళన చేశావు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో నీకూ వస్తుంది’’
అని శాపం ఇచ్చింది. ఇందుకు రాజకుమారి భయపడి ఇంటికి వెళ్లిపోగా సుశీలాదేవి తన శరీరాన్ని ఆకులతో కప్పుకొని ఆశ్రమానికి వెళ్లిపోయింది.
సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న రాజు వీరభద్రుడు హుటాహుటిన ఉగ్రశ్రవ మహర్షి ఆశ్రమానికి చేరుకొని మహర్షి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. మహర్షి ఉగ్రశ్రవుడు ఇందుకు సుశీలాదేవి మాత్రమే పరిష్కారం చూపగలదని చెప్పడంతో మహారాజు వీరభద్రుడు, రాజకుమారి దేవిక సుశీల పాదాలపై పడి క్షమాపణ కోరారు. స్వతహాగా దయామయురాలు అయిన సుశీలా దేవి నారాయణుని స్మరించమని శాపవిమోచనం తెలిపింది.
అప్పటినుండి రాజకుమారి దేవిక అహంకారం నశించి నారాయణ ధ్యానం లోకి వెళ్లి పోయింది. త్రేతాయుగం పూర్తయింది... ద్వాపరయుగం ఆరంభమైంది. వీరభద్ర మహారాజు ద్రుపద మహారాజు అయ్యాడు. రాజకుమారి దేవిక.. ద్రౌపది అయింది. యుగాలు మారినా కర్మ సిద్ధాంతం వెతుక్కుంటూ రానే వచ్చింది. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఆనాటి ఐదుగురు చెలికత్తెలు పాండవులైనప్పటికీ నిస్సహాయులయ్యారు. కురుపితామహుడు సైతం మిన్నకుండి పోవడంతో ఆయన కూడా కురుక్షేత్ర సంగ్రామంలో అంపశయ్యపై పరుండవలసి వచ్చింది.
చూశారా! విధి ఎంత బలమైనదో..... యుగాలు నాటి శాపం... కర్మ సిద్ధాంతం తమ ధర్మాన్ని నిర్వర్తించాయి.
– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు.


