కీచక పర్వం | killing of Keechaka is described in the Virata Parvam | Sakshi
Sakshi News home page

కీచక పర్వం

Oct 5 2026 4:44 AM | Updated on Oct 5 2026 4:44 AM

killing of Keechaka is described in the Virata Parvam

భారత విజ్ఞానం

మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులను కీచుకుడు అంటారు. అలాంటి ఏదైనా సంఘటన జరిగితే కీచక పర్వం అంటారు. అసలు కీచకుడు ఎవరు? ఎందుకు ఈ నానుడి వచ్చిందో తెలుసుకుందాం...

మాయా జూదంలో ఓడిన పాండవులు ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసాన్ని మత్స్య దేశపు రాజైన విరాటరాజు కొలువలో చేసారు. ఆ సమయంలో ద్రౌపది సైరంద్రి అనే పేరుతో విరాటరాజు భార్య సుధేష్ణకు పరిచారికగా సేవలు అందించేది. సుధేష్ణ తమ్ముడైన కీచకుడు విరాట్‌ రాజు కొలువులో సైన్యాధిపతిగా వ్యవహరించేవాడు. ఒకనాడు సైరంద్రి సౌందర్యాన్ని చూసి మోహించిన కీచకుడు దుర్బుదితో ఆమెను పొందాలని ప్రయత్నించాడు. 

తన సోదరి సుధేష్ణ హెచ్చరించినా వినకుండా ద్రౌపది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని పాండవులలో బలపరాక్రముడు, మల్ల యుద్ధ వీరుడైన భీమునితో ద్రౌపది రహస్యంగా మొరపెట్టుకోవడంతో కీచక వధకు రంగం సిద్ధమైంది. పథకంలో భాగంగా ద్రౌపది, కీచకుడిని రాత్రి సమయంలో నర్తనశాలకు రమ్మని పిలిచింది. ద్రౌపదితో పాటు భీముడు కూడా నర్తనశాలకు మహిళను తలపించేలా మేలి ముసుగు ధరించి వెళ్ళి అక్కడ ఉన్న పాన్పుపై శయనించాడు. 

పూర్తిగా మద్యం సేవించి నర్తన శాలకు చేరుకున్న కీచకుడు శయ్యపై ఉన్నది ద్రౌపదే అనుకుని భీముని పై చేయి వేయడంతో ఆ చేతిని ఎంతో ఒడుపుగా పట్టుకున్న భీముడు ఎంతో బలవంతుడైన కీచుకుని తలపట్టుకుని వంచి మోకాళ్ళతో గట్టిగా అదిమాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్దంలో కీచకుని ఒక మాంసపు ముద్దలా చేసి పైకెత్తి నేలపై పడవేయటంతో కీచకుడు మరణించాడు. అప్పటినుండి ఎవరైనా మహిళలను వేధిస్తున్నట్లయితే, వాడు మహిళల పాలిట కీచకుడిలా తయారయ్యాడు అనడం పరిపాటి అయింది. 

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement