భారత విజ్ఞానం
అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ఉపదేశిస్తున్నప్పుడు శ్రీ కృష్ణుడు, వ్యాసమహర్షి, పాండవులు శ్రద్ధగా విన్నారే కానీ ఎవరూ వ్రాసుకోలేదు. ఎంతో మహిమాన్వితమైన సహస్రనామాలను అందరికీ చేరేందుకు లిఖించబడాలి... కానీ ఇప్పుడు ఎలా? అని ధర్మరాజు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మను అడుగగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ పాండవుల్లో కనిష్టుడైన సహదేవుడు వల్లే సాధ్య అవుతుంది. అంతేకాకుండా వ్యాస మహర్షి లిఖిస్తే అందరికీ అందేలా గ్రంథస్థం చేయించవచ్చునని సమాధానమిచ్చాడు. అందుకు ధర్మరాజు అదెలా సాధ్యమనగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ మనందరిలో ఒక సహదేవుడు మాత్రమే సూతస్పటికం వేసుకున్నాడు. దానివల్లే సాధ్యమవుతుందన్నాడు.
సూత స్ఫటికం అంటే.....
వాతావరణంలో ప్రయాణించే శబ్ద తరంగాలను గ్రహించి తనలో నిల్వ చేసుకోగల ఒక అద్భుతమైన స్పటికం. హిందూ పురాణాల ప్రకారం సూతస్ఫటికాన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. నేటి ఆధునిక టేప్ రికార్డర్లా పనిచేస్తుంది. గాలిలో కలిసిపోయిన శబ్ద తరంగాలను రికార్డు చేసుకుని అవసరమైనప్పుడు మళ్ళీ వినిపించ గల శక్తి దీనికుంది.సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం మనమందరం పిలుస్తున్న క్లౌడ్ స్టోరేజ్ లాంటిది.
అంత మహిమాన్వితమైన సూతస్పటికాన్ని ధరించిన సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే స్పటికంలో నమోదుకాబడిన శబ్ద తరంగాలు వెనకకు వస్తాయని (రీప్లే)వాటిని వ్యాస మహర్షి తో వ్రాయించాలని శ్రీ కృష్ణుడు సలహా ఇవ్వడంతో సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థించడం, వ్యాసమహర్షి విష్ణు సహస్రనామాలను లిఖించడంతో, అవి మనందరికీ గ్రంథస్వరూపంలో అందాయి. వాటినే మనం ప్రతిరోజు పఠనం చేసుకుంటున్నాము.
ఇదంతా ఎలా తెలిసిందంటే... బహుశా... 1940లో అనుకుంటా... అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామీజీని ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి టేప్ రికార్డుతో వచ్చాడు. ఆ సందర్భంగా స్వామీజీ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏదని అడిగితే ఎవరినుండీ....ఏ మాత్రం సమాధానం రాలేదు. అప్పుడు స్వామీజీ మనకు విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయి ?.... ఎలా లిఖించబడింది.... ఎవరు వ్రాసారు... అని ప్రశ్నించారు. మరలా మౌనమే సమాధానం కావడంతో స్వామీజీ పైన చెప్పుకున్న కథనంతా చెప్పారన్నమాట.
– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు


