ధృతరాష్ట్ర  కౌగిలి | Dhritarashtra Embraces Bhima | Sakshi
Sakshi News home page

ధృతరాష్ట్ర  కౌగిలి

Sep 7 2026 4:38 AM | Updated on Sep 7 2026 4:38 AM

Dhritarashtra Embraces Bhima

భారత విజ్ఞానం

ఎంతో ఆప్యాయతను, ప్రేమనూ నటిస్తూ, తియ్యగా పలకరిస్తూ లోలోపల తీవ్రహాని తలపెట్టే సందర్భాలను, ప్రమాదకర పరిస్థితులను ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులు పట్టాభిషేకం నిర్వహించుకోవడానికి ముందు తమ పెదనాన్న ధృతరాష్ట్రుని కలవడానికి వెళ్లారు. తన నూరుగురు కుమారులను పాండవులలో రెండోవాడైన భీముడు చంపాడన్న కోపాన్ని లోలోపలే ఉంచుకొని కక్షతో రగిలిపోతున్న ధృతరాష్ట్రుడు పైకి మాత్రం ప్రేమను నటిస్తూ అందరినీ కౌగిలించుకొని ప్రత్యేకంగా భీముడిని తన ఉక్కుకౌగిలిలో బంధించి చంపి వేయాలని భావిస్తుంటాడు. 

ఈ విషయం తెలిసిన జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణ పరమాత్మ ఉక్కుతో భీముని విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. తనను కలవడానికి వచ్చిన పాండవులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకొంటాడు. అయితే ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా భీముడేడి అని అడుగుతున్న సమయంలో శ్రీ కృష్ణ పరమాత్మ భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని వద్దకు తీసుకెళ్లగా దానినే భీముడుగా భావిస్తూ ధృతరాష్ట్రుడు తన ఉక్కుకౌగిలిలో బంధించగా ఆ విగ్రహం తుక్కు తుక్కు అయిపోయింది.

ధృతరాష్ట్రునికి ఎందుకంత బలం?
పుట్టుకతో అంధుడైనా, వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ధృతరాష్ట్రునికి సుమారు పదివేల ఏనుగుల బలం సిద్ధించింది. తనకున్న బలంతో తన నూరుగురు కొడుకులను చంపిన భీముడిని కౌగిలించుకుని చంపాలన్నది ధృతరాష్ట్రుని ప్రణాళిక. దీనిని గమనించిన శ్రీకృష్ణుడు ఇనుముతో తయారుచేసిన విగ్రహాన్ని ఉంచగా ఆ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు కౌగిలించుకొని తన బలాన్నంతా ఉపయోగించి ఇనుప విగ్రహాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. దీంతో శ్రీ కృష్ణుని వల్ల భీముడికి ప్రాణాపాయం తప్పింది. అప్పటినుండి ధృతరాష్ట్ర కౌగిలి అనే నానుడి వచ్చింది.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement