లోహగఢ్‌ కోట.. కేతన్‌ హత్యలో మరో షాకింగ్‌ ట్విస్ట్‌ | Third arrest in Pune Ketan Agarwal case | Sakshi
Sakshi News home page

లోహగఢ్‌ కోట.. కేతన్‌ హత్యలో మరో షాకింగ్‌ ట్విస్ట్‌

Sep 6 2026 7:27 AM | Updated on Sep 6 2026 7:53 AM

Third arrest in Pune Ketan Agarwal case

మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్‌ కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘గుట్టు రట్టయితే గుండెల్లో గుబులు’ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేతన్‌ కాబోయే భార్య సియా గోయల్‌, ఆమె సన్నిహితుడు చేతన్‌ చౌదరి అరెస్టు కాగా.. తాజాగా వారి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్‌ హాంగే కూడా పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారింది.

మూడో నిందితుడు అరెస్ట్‌
జూన్‌ 18న లోహగఢ్‌ కోట వద్ద కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేసిన కేసులో 22 ఏళ్ల రితేష్‌ హాంగేను పుణె రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రితేష్‌ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితేష్‌ హాంగే ప్రధాన నిందితుడు చేతన్‌ చౌదరికి స్నేహితుడు. కేతన్‌ హత్యకు సంబంధించిన కుట్రలో రితేష్‌ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్‌ను హత్య చేయాలన్న ప్లాన్‌ గురించి అతడికి ముందే తెలుసునని పోలీసులు వెల్లడించారు.

ముందు పెళ్లిని అడ్డుకోవాలనుకున్నారు..
‘అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి’ అన్నట్టుగా ఈ హత్య వెనుక మొదట మరో ప్లాన్‌ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్‌, సియా గోయల్‌ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో.. పెళ్లిని అడ్డుకునేందుకు సియా, చేతన్‌ తొలుత కేతన్‌ను తీవ్రంగా గాయపరచాలని భావించినట్లు తెలుస్తోంది. కేతన్‌ చేతులు, కాళ్లు విరగ్గొట్టి అతడిని గాయపరిస్తే పెళ్లి వాయిదా పడుతుందని వారు భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్లాన్‌ ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ఇద్దరూ.. చివరకు ఏకంగా కేతన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర గురించి రితేష్‌కు కూడా ముందుగానే తెలుసునని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా.. 

పక్కా స్కెచ్‌.. 
కేతన్‌ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా స్కెచ్‌ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘పాము చావాలి.. కర్ర విరగకూడదు’ అన్నట్టుగా హత్య చేసినా తమపై అనుమానం రాకుండా ఉండేందుకు పలు మార్గాలను అన్వేషించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్‌లో సమాచారం వెతికినట్లు, సస్పెన్స్‌ సినిమాలను కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. టైగర్‌ పాయింట్‌, విసాపూర్‌ కోటతో పాటు పూణే పరిసరాల్లోని మరికొన్ని కోటలను నిందితులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఫొటోలను పరస్పరం పంపించుకుని.. కేతన్‌ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో అంచనా వేశారు. చివరకు లోహగఢ్‌ కోటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్య తర్వాత రితేష్‌కు ఫోన్‌..
అనుకున్నట్టుగానే జూన్‌ 18న లోహగఢ్‌ కోట వద్ద కేతన్‌ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చేతన్‌.. తన స్నేహితుడు రితేష్‌కు ఫోన్‌ చేసి కేతన్‌ హత్యకు సంబంధించిన విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రితేష్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్‌ చేసినట్లు పూణే రూరల్‌ ఎస్పీ సందీప్‌ సింగ్‌ గిల్‌ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేతన్‌ హత్యకు ముందు జరిగిన కుట్ర, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రితేష్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement