ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
హైదరాబాద్: వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జహీరాబాద్ టౌన్ ఎస్సై లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కోహిర్ మండలం బిలాల్‌పూర్ గ్రామానికి చెందిన కొనగారి వినయ్‌కుమార్‌కు రెండేళ్ల క్రితం తోరమామిడి గ్రామానికి చెందిన బంటు స్వాతితో వివాహమైంది. కాగా పెళ్లికి ముందే స్వాతికి కోహీర్ పట్టణంలోని లాలాగూడకు చెందిన వరుసకు బావ అయిన నాగరిగారి ప్రవీణ్ కుమార్‌తో ప్రేమలో ఉంది.
ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో స్వాతికి వినయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. కాగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రవీణ్ కుమార్ తన మరదలు స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి భర్త భార్యతో విడిగా ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ కుమార్ తరచూ స్వాతి భర్తకు ఫోన్ చేస్తూ, ‘నీ భార్య నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘ అని బెదిరిస్తూ మెసేజ్‌లు, ఫొటోలు పంపిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్‌ను పూర్తిగా మట్టుబెట్టాలని ప్రవీణ్ కుమార్ కర్నాటక బీదర్‌కు చెందిన తన పెద్దమ్మ కొడుకు ప్రవీణ్‌తో కలిసి హత్యకు పథకం పన్నాడు.
గత నెల 9న సాయంత్రం జహీరాబాద్‌లోని చెన్నారెడ్డి కాలనీలో వినయ్‌కుమార్‌ను అడ్డుకుని గొడవ పెట్టుకున్నారు. ప్రవీణ్ అతనిని వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా నాగరిగారి ప్రవీణ్ కుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్ వీపుపై తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో వినయ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు.
చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్‌లో కర్రలతో దాడులు


