సాక్షి, కరీంనగర్: ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందంటూ రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ యువ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ, ఎక్కడున్నావు.. హైదరాబాద్‌కు ఎందుకు రావు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి రెన్యూవల్ సీఎం.. జాబ్ క్యాలెండర్.. చిత్తు కాగితం కంటే హీనమని తేలిపోయింది. వెయ్యి రోజులయ్యాయి. యూత్ డిక్లరేషన్ గురించి అడిగితే బూతులు వినిపిస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం తన్నుకుంటున్నారు. వీళ్లకు తిక్క ఉంది.. కానీ లెక్కలేదు. నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లు మాత్రం జరుగుతున్నాయి. నిరుద్యోగులు నిప్పు కణికలే మండాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ రాజీనామా చేయాలా?. ధోకేబాజ్ రేవంత్ చేయాలా?. కేసీఆర్‌తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోర్ ట్వంటీ హామీలిచ్చిన మీరే 420 సార్లు హామీలు చేయాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కొట్లాడుకుంటున్నారు. మీకు దండం పెట్టినోళ్లే.. రేపు పిండాలు పెడతారు. రాహుల్ గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. అవుతల పడ్డాడు. సీల్డ్ కవర్‌లో పంపిన మీ సీఎం ఏం చేస్తుండో నీకు సోయి ఉందా రాహూల్ ?. నెలకోసారి మూటలు తీసుకుని రాహూల్ గాంధీ నోరు మూసుకుని కూర్చుంటుండు’’ అంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు.


