రియల్‌ ఎస్టేట్‌లో కీలక సంస్కరణలు | Real Estate Reforms Telangana Faster Building Approvals Single-Window Clearance | Sakshi
Sakshi News home page

రియల్‌ ఎస్టేట్‌లో కీలక సంస్కరణలు

Sep 5 2026 11:50 AM | Updated on Sep 5 2026 12:40 PM

Real Estate Reforms Telangana Faster Building Approvals Single-Window Clearance

వ్యక్తిగత భవన నిర్మాణాలకు వేగవంతమైన అనుమతులు

కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లకు సమగ్ర సింగిల్‌ విండో అవసరం

సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల విధానం మరింత సులభతరం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎంప్యానెల్డ్‌ థర్డ్‌ పార్టీలు ఇచ్చే సాంకేతిక పరిశీలన, తనిఖీ నివేదికల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలు నిర్ణయాలు తీసుకునే విధానానికి అవకాశం కల్పిస్తూ ఆగస్టు 1న జీఓ 229ను జారీ చేసింది. దీంతో ఆమోదిత లేఅవుట్లలో 500 చదరపు మీటర్ల వరకు ప్లాట్‌ విస్తీర్ణం, 10 మీటర్ల వరకు ఎత్తు ఉన్న వ్యక్తిగత నివాస భవనాలకు ఎంప్యానెల్డ్‌ థర్డ్‌ పార్టీ తనిఖీ నివేదిక ఆధారంగా అనుమతి లేదా తిరస్కరణ జారీ చేయవచ్చు. అలాగే 300 చ.మీటర్ల వరకు ప్లాట్, 10 మీటర్ల వరకు ఎత్తు ఉన్న భవనాలకు కంప్లీషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ విషయంలోనూ థర్డ్‌ పార్టీ తనిఖీ నివేదిక పరిగణనలోకి తీసుకోవచ్చు.

200 చదరపు మీటర్ల వరకు ప్లాట్, ఏడు మీటర్ల వరకు ఎత్తు ఉన్న వ్యక్తిగత భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తీసుకోవడం ఐచ్ఛికమని జీఓ పేర్కొంది. కానీ భవన నిబంధనలు, జోనింగ్‌ రెగ్యులేషన్లు, మాస్టర్‌ప్లాన్, ఇతర చట్టబద్ధమైన ప్రమాణాలను సడలించే అధికారం మాత్రం థర్డ్‌ పారీ్టలకు లేదు. ఆ అధికారం సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌ వద్దే ఉంటుంది. కేసుల కేటాయింపు, తనిఖీలు, ఆడిట్, ఉల్లంఘనలపై చర్యలు వంటి పర్యవేక్షణ వ్యవస్థను కూడా జీఓ సూచించింది. ఇదే సంస్కరణలను మరింత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలతో హైరైజ్‌ భవనాలు, గ్రూప్‌ హౌసింగ్, గేటెడ్‌ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, మిక్స్‌డ్‌ యూజ్‌ ప్రాజెక్టులకు దశలవారీగా విస్తరించాలని స్థిరాస్తి వర్గాలు కోరుతున్నాయి. 

పెద్ద ప్రాజెక్టులకు ఇబ్బందులు..
పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్‌ల అనుమతికి అగ్నిమాపక, ట్రాఫిక్‌ పోలీసు, కాలుష్య నియంత్రణ మండలి, జలమండలి, విద్యుత్‌ సంస్థలు, అవసరమైన చోట ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, పర్యావరణ విభాగాల అనుమతులు, ఎన్‌ఓసీలు అవసరమవుతాయి. నిర్మాణదారుడు ఒక్కో శాఖను సంప్రదించాల్సి వస్తోంది. ఒకే పత్రాలు, డ్రాయింగ్‌లు, సాంకేతిక వివరాలను పలుమార్లు సమర్పించాలి. ఒకవేళ అభ్యంతరాలు వస్తే డిజైన్‌ను పలుమార్లు మార్చాల్సి వస్తోంది. దీంతో కాలయాపన జరిగి ప్రాజెక్టు వ్యయం పెరుగుతోంది. ఈ భారం పరోక్షంగా గృహ కొనుగోలుదారుడిపై పడే అవకాశం ఉంటుంది.  

ఒకే దరఖాస్తు అన్ని శాఖల సమన్వయం 
హైరైజ్, గ్రూప్‌ హౌసింగ్, కమర్షియల్‌ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నిజమైన సమగ్ర డిజిటల్‌ సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిర్మాణదారుడు ఒకేసారి దరఖాస్తు, భూమి పత్రాలు, మాస్టర్‌ప్లాన్‌ వివరాలు, ఆర్కిటెక్చరల్‌ డ్రాయింగ్‌లు, స్ట్రక్చరల్‌ కాన్సెప్ట్‌, ఫైర్‌ సేఫ్టీ ప్లాన్, ట్రాఫిక్‌ అధ్యయనం, నీరు–డ్రైనేజీ వివరాలు, విద్యుత్, పర్యావరణ సమాచారాన్ని సమర్పించాలి. ఆన్‌లైన్‌లోనే అవసరమైన శాఖలు ఎన్‌ఓసీలను అందజేయాలి. తీవ్రమైన ప్రజా భద్రత లేదా చట్టపరమైన అంశం బయటపడితే తప్ప, ఇప్పటికే పరిశీలించిన అంశాలను పదేపదే తిరిగి తెరవకుండా స్పష్టమైన విధానం ఉండాలి.  

పారదర్శకతకు వీలు.. 
జీఓ 229 విధానాలను హైరైజ్, గ్రూప్‌ హౌసింగ్, కమర్షియల్‌ ప్రాజెక్టులకు విస్తరించాలి. దీంతో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూనే, పరిశీలనను వృత్తిపరంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసే వీలుంటుంది. ఈ మంచి సంస్కరణను సమగ్ర సింగిల్‌ విండో వ్యవస్థగా అభివృద్ధి చేస్తే, తెలంగాణ నిర్మాణ అనుమతుల్లో వేగం, పారదర్శకత, భద్రతకు దేశానికే ఆదర్శంగా నిలవగలదు. 
– మారం సతీశ్‌కుమార్, ప్రెసిడెంట్, గ్రేటర్‌ ఈస్ట్‌ జోన్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement