మోదీ ‘గేర్‌’కు వరద బ్రేక్‌.. డ్రీమ్‌ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ సెటైర్లు | Congress Satirical Comments On Modi And Dwarka Expressway | Sakshi
Sakshi News home page

మోదీ ‘గేర్‌’కు వరద బ్రేక్‌.. డ్రీమ్‌ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ సెటైర్లు

Sep 5 2026 10:49 AM | Updated on Sep 5 2026 10:56 AM

Congress Satirical Comments On Modi And Dwarka Expressway

‘గేర్‌ మార్చే’ ఎక్స్‌ప్రెస్‌వే.. వరద నీటిలో ఎందుకు మునిగింది? ఢిల్లీలో కురిసిన భారీ వర్షం ఇప్పుడు ప్రకృతితో పాటు రాజకీయ తుఫాన్‌నూ రేపింది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లోనే వరద నీరు చేరడంతో కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన టన్నెల్‌లో గంటపాటు తాను చిక్కుకుపోయానంటూ కాంగ్రెస్‌ ఎంపీ బ్రిజేంద్ర సింగ్‌ వీడియో విడుదల చేయడం.. ఇప్పుడు మోదీ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది.

ఈ సందర్భంగా ‘ప్రజల జీవితాల్లో గేర్‌ మారుస్తుంది’ అన్న ప్రాజెక్టు.. భారీ వర్షం పడగానే నీటిలోనే ఆగిపోయిందంటూ కాంగ్రెస్‌ సెటైర్లు వేస్తోంది. అసలు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ టన్నెల్‌లో నీరు ఎందుకు నిలిచింది? మౌలిక వసతులపై ప్రభుత్వ గొప్పలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత భిన్నంగా ఎందుకున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే, 2024లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన సమయంలో ప్రధాని మోదీ.. ఈ ప్రాజెక్టు ఢిల్లీ-హర్యానా మధ్య ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుందని, వాహనాలే కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లోనూ ‘గేర్‌ మారుతుందని’ పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టులోని టన్నెల్‌ భారీ వర్షాలకు నీటమునగడంతో కాంగ్రెస్‌ ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది.

మరోవైపు.. భారీ వర్షం కారణంగా ఢిల్లీ ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌ తీవ్రంగా స్తంభించింది. భారీ వర్షాల ప్రభావం ఢిల్లీ విమానాశ్రయంపైనా పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో సామాన్లతో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య కనీసం తొమ్మిది విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. అటు గురుగ్రామ్‌లోని సైబర్‌ సిటీ, శంకర్‌ చౌక్‌, శీత్లా మాతా రోడ్‌ ప్రాంతాల్లోనూ భారీగా నీరు నిలిచింది. ఇక వర్షాలపై భారత వాతావరణ శాఖ ఢిల్లీకి తొలుత ఎల్లో అలర్ట్‌ జారీ చేయగా.. పరిస్థితి తీవ్రతరం కావడంతో రెడ్‌ అలర్ట్‌కు పెంచింది. ఉరుములు, మెరుపులతో పాటు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవైపు భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement