కెనడాకు చెందిన 37 ఏళ్ల శ్రీలంక తమిళ మహిళను మోసం చేసి, వీడియో కాల్ ద్వారా నగ్న పూజలు చేయించిన ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఈ కేసులో టీవీ ఛానళ్లలో కనిపించే గిరి అనే కిళి చిలుక జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కోడంబాక్కంలో నివసిస్తూ, టీవీలో వచ్చే చిలుక జ్యోతిష్య కార్యక్రమాలను చూసి బాధితురాలు సంప్రదించింది. ఆమెకు నమ్మకం కలిగించేలా మాట్లాడిన జ్యోతిష్యుడు, ఒక ప్రత్యేక నగ్న పూజ చేస్తే ఆమె కోరికలన్ని నెరవేరుతాయని నమ్మబలికాడు. దానికి అంగీకరించిన సదరు మహిళకు వీడియో కాల్ చేసి, బట్టలు విప్పించి తను కూడా నగ్నంగా ఉంటూ ఈ పూజల కోసం మొదట రూ.20 వేలు తీసుకున్నాడు.
ఆ తర్వాత, వీడియో కాల్ మొత్తాన్ని రికార్డ్ చేశానని, తనకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వకపోతే ఆ అశ్లీల దశ్యాలను ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని సదరు మహిళను బెదిరించడం ప్రారంభించాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతను తెన్కాసి జిల్లాకు చెందిన ఇసక్కి ముత్తు అని, కుట్రాలం పరిసరాల్లో దాక్కున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాగే మరికొంతమంది మహిళలను కూడా మోసం చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
-తమిళనాడు


