సింధు నదిపై భారత్ వేసిన ఓ చిన్న అడుగు ఇప్పుడు పాకిస్తాన్‌ను టెన్షన్‌కు గురి చేస్తోంది. లడఖ్‌లోని ఉప్షి వద్ద సింధు నదిపై భారత్ తొలిసారిగా రాక్ చెక్‌డ్యామ్ నిర్మించింది. సహజ రాళ్లతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ వల్ల నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగులు పెరిగింది. దీంతో ఇన్నాళ్లుగా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సరిహద్దు గ్రామాల రైతులకు నీరు అందే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ప్రాజెక్టును కేవలం రైతుల కోసం చేపట్టిన నీటి సంరక్షణ చర్యగానే చూడాలా? లేక భవిష్యత్తులో సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకునే భారత్ వ్యూహంలో ఇది తొలి అడుగా? అన్న చర్చ మొదలైంది.
ఇక్కడ పాకిస్తాన్‌కు తక్షణంగా భారీ నష్టం లేకపోయినప్పటికీ.. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని ప్రాంతాల్లో వరుసగా నిర్మిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. లడఖ్ పరిపాలన ఇప్పటికే మరో 36 చెక్‌డ్యామ్‌లు, వీయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లేహ్‌లో ఏడు హిమాలయన్ రాక్ చెక్‌డ్యామ్‌లు, కార్గిల్‌లో 29 చెక్‌డ్యామ్‌లు లేదా వీయర్లను నిర్మించే ప్రతిపాదన ఉంది. అంటే సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నీటిని అక్కడికక్కడే నిల్వ చేసి స్థానిక అవసరాలకు వినియోగించే మౌలిక వసతులను భారత్ క్రమంగా పెంచుకుంటోంది.
నీటి నిల్వతో పాక్‌కు టెన్షన్..
ఇదే అంశం పాకిస్తాన్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. సింధు నదీ వ్యవస్థ ఆ దేశ వ్యవసాయానికి, నీటి సరఫరాకు, ఆహార భద్రతకు అత్యంత కీలకం. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఈ నదీ వ్యవస్థపై భారీగా ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన భూభాగంలో లభించే సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకోవడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో పాకిస్తాన్‌కు చేరే నీటి ప్రవాహం, దాని సమయంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఉప్షి వద్ద నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ ప్రధాన ఉద్దేశం స్థానికంగా నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించడమే. లడఖ్‌లోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వ్యవసాయాన్ని కాపాడుకోవడం అక్కడి ప్రజలకు కీలకంగా మారింది. నది లోతైన గార్జ్‌లలో ప్రవహించడం, వసంతకాలంలో నీటి మట్టం తగ్గిపోవడంతో రైతులు నేరుగా పంపుల ద్వారా నీటిని తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. చెక్‌డ్యామ్ నిర్మాణంతో ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తోంది.
పహల్గామ్ ఎఫెక్ట్?
అయితే దీని వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. 2025లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. అదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ‘అబేయన్స్’లో ఉంచింది. అప్పటి నుంచి సింధు జలాల అంశం ఇరు దేశాల మధ్య కీలక వ్యూహాత్మక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని భారత్ పెంచుకోవడం పాకిస్తాన్‌కు సహజంగానే ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. భారత్ ఇప్పటివరకు పరిమితంగా వినియోగించిన నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకునే మౌలిక వసతులను పెంచుకుంటే.. దాని ప్రభావం భవిష్యత్తులో పాకిస్తాన్‌పై పరోక్షంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి ప్రాజెక్టులు ఒక్కటిగా కాకుండా వరుసగా అమలైతే.. సరిహద్దు ప్రాంతాల్లో నీటి నిల్వ, సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరగొచ్చు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాకిచ్చిన టీవీకే
అందుకే ఉప్షి వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ పరిమాణంలో చిన్నదైనా.. దాని వెనుక ఉన్న సందేశం మాత్రం పెద్దదిగా కనిపిస్తోంది. ఒకవైపు లడఖ్ రైతులకు సాగునీరు అందించడం, మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నీటి భద్రతను బలోపేతం చేయడం.. భవిష్యత్తులో సింధు జలాలను మరింత సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఒక్క చెక్‌డ్యామ్‌తో పాకిస్తాన్‌కు నీళ్లు ఆగిపోవు.. కానీ ఇలాంటి ప్రాజెక్టుల సంఖ్య పెరిగితే సింధు జలాలపై భారత్ వినియోగ సామర్థ్యం మాత్రం పెరగవచ్చు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్‌కు అసలు టెన్షన్‌గా మారుతోంది.


