breaking news
Indus Water
-
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
పాక్ జలఖడ్గంపై కేంద్ర ప్రకటన విడ్డూరం
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన నీటి వాటాను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు. కశ్మీర్, పంజాబ్‌లలో ప్రాజెక్టులు కట్టి పాక్‌కు నీటి వాటాను తగ్గించాలని 2016లోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకుంటే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్‌కు నీటివాటాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాక్‌పై దేశ ప్రజలకున్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అహ్మద్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయమేమిటంటే!! ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని అందుకే తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారని భారత్ ఆరోపిస్తోంది. దీంతో సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న నీటి వాటాను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని జల వనరుల మంత్రి నితిన్ గడ్కారీ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే 6 సంవత్సరాలు పట్టొచ్చని, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అప్పటిలోగా 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశ ప్రజలకు దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు వెళ్తున్న మన నీటిని నిలిపివేసి కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలని యోచిస్తున్నామని తెలిపిన విషయం తెలిసిందే. (పాక్‌పై జలఖడ్గం) -
పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్
న్యూఢిల్లీ: సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రతిదానికి పాకిస్థాన్ ను నిందించడం సరికాదన్నారు. ఉడీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్ సమావేశాల నుంచి భారత్ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా సార్క్ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.