
న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.
చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది.
పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అంతు చూస్తాం..
ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.