విశ్లేషణ
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశం పోకడలతో చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత దేశపు ‘గొప్ప వ్యూహం’ ఏమిటి? దేశ, విదేశీ వ్యవహారాలలో మన విధానాలు ఏమిటి? అని ప్రశ్నించుకోవడం సము చితం. మనకు మనం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అవి ఎలా ఉపకరిస్తాయో ఆలోచించాలి.
అసలు వృద్ధి మార్గం
‘‘అధికార సమతూకం సూచించే దానికన్నా ఒక పరిస్థితి నుంచి ఎంత ఎక్కువ లాభపడగలమో చూడాలి. అది అధికారాన్ని సృష్టించుకునే కళ’’ అని లారెన్స్ ఫ్రీడ్‌మ్యాన్ తన ‘స్ట్రాటెజీ: ఎ హిస్టరీ’ అనే పుస్తకంలో వ్యాఖ్యానిస్తారు. అధికారానికి అనేక కొలమానాలుంటా యని బెర్ట్‌రండ్ రసెల్, ఇంకా చాలామంది చెప్పారు. కనుక, వ్యూహాలు కూడా వాటిని అమలుపరచుకునేందుకు నిర్దేశించుకున్న కాల వ్యవధులను బట్టి అనేక రూపాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. మరి గొప్ప వ్యూహం అంటే ఏమిటి? దీనికీ అనేక నిర్వచనాలు న్నాయి. ఎంచుకున్న రంగాన్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. సైనిక వ్యవహారాల్లో ఒకలా, వ్యాపారంలో ఒకలా! అధికారాన్ని హస్త గతం చేసుకునేందుకే కాదు, దాన్ని నిలబెట్టుకునే, వినియోగించు కునే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.
అయితే, భారతదేశపు గొప్ప వ్యూహం ఏమిటి? అలీనోద్యమం మాదిరిగానే, ‘బహుళ–అనుగుణ్యత’ మన విధానమని ఇపుడు చాలా మంది సూచిస్తున్నారు. కానీ, అది ఆ రెండు భావనలను తప్పుగా అర్థం చేసుకోవడమవుతుంది. అలీనోద్యమమైనా, బహుళ –అనుగుణ్యత అయినా ఒక లక్ష్యాన్ని సాధించుకునే మార్గం. అవి వాటికవే ప్రయోజనాలు కావు.
జాతీయ అజెండాయే వ్యూహం
దివంగత కె.సుబ్రహ్మణ్యం ఈ విషయంలో నాకు గురువు. అభివృద్ధి చెందిన దేశంగా పునరావిర్భవించడం; ఆయుధాలను కాక, విజ్ఞానాన్ని అధికార చలామణీకి సాధనంగా గుర్తించడం భారత దేశపు గొప్ప వ్యూహమని ఆయన చెప్పేవారు. ‘స్వీయ జనాభాతో పాటు మొత్తం మానవాళి సంక్షేమానికి, ప్రపంచ శాంతికి భారత్ పాటుపడాలనీ; పారిశ్రామికీకరణ చెందిన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తనను తాను అభివృద్ధి చేసుకున్నప్పుడే ప్రపంచంలో దానికి సరైన స్థానం దక్కుతుందనే భావన రాజ్యాంగ పరిషత్ 1947లో చేసిన ప్రమాణంలో ఉందనీ’ సుబ్రహ్మణ్యం 2012లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ చెప్పుకునే ఏ గొప్ప వ్యూహానికైనా ఇదే సరైన నిర్వచనం కావాలని ఆయన సూచించారు.
భారత ఉపఖండం ఒకప్పుడు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థతో వర్ధిల్లింది. 18వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా నాల్గవ వంతుగా ఉంది. చైనాది మరో నాల్గవ వంతు వాటా. ఈ భావనే భారత జాతీయోద్యమ నాయకత్వానికి స్ఫూర్తినిచ్చింది.
పదిహేడవ శతాబ్దంలో ప్రపంచ ఆదాయంలో చైనా–భారత్‌ల వాటా దాదాపు 25 శాతంగా లెక్కకు వచ్చేదని బ్రిటిష్ చరిత్రకారుడు ఆంగస్ మాడిసన్ ఎంతో శ్రమకోర్చి రూపొందించిన గణాంక అధ్యయనంలో వెల్లడించారు. ఈ రెండు దేశాల వాటా 1950 కల్లా 5% కన్నా తక్కువకు పడిపోయింది. రెండు దేశాలు వలస పాలకు లను గద్దె దింపి, ప్రపంచ ఆదాయంలో తమ వాటా తిరిగి దక్కించు కోవాలని కోరుకున్నాయి. ప్రపంచ దేశాల సరసన తనకుండవలసిన గౌరవ స్థానాన్ని పునరుద్ధరించుకునేందుకూ, ప్రపంచ ఆదాయ, వాణిజ్యాలలో రావలసిన వాటాను దక్కించుకునేందుకూ వీలు కల్పించే అంతర్జాతీయ క్రమ వ్యవస్థ రూపుదిద్దుకునేటట్లు చూడటం స్వతంత్ర భారతదేశ జాతీయ అజెండా అయింది. ఒక రకంగా, అదే దాని గొప్ప వ్యూహమని చెప్పుకోవచ్చు.
అమెరికాను నమ్మగలమా?
ప్రపంచ పర్యావరణం సానుకూలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతుంది. ప్రపంచ వ్యవ హారాలలో ప్రస్తుత స్థితిని చూడండి: అమెరికా, ఇజ్రాయెల్ తీసుకునే చర్యలు భారత్ ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రపంచ, ప్రాంతీయ పర్యావరణాన్ని సృష్టించేవిగా ఉన్నాయా? లేకపోతే, మనం మౌన ముద్ర వహించడానికి బదులుగా వాటి చర్యలకు అభ్యంతరం చెప్ప వద్దా? అల్లకల్లోల పశ్చిమాసియా ‘వికసిత్ భారత్’ దిశగా భారత్ పయనాన్ని మందగింపజేయడం లేదా? అలా అయితే, మోదీ ప్రభుత్వ ప్రస్తుత వైఖరి మన గొప్ప వ్యూహానికి అనువైనదిగానే ఉందా?
భారత్ గొప్ప వ్యూహ సాధనకు అమెరికా ఒక భాగస్వామిగా తోడ్పడగలదనే ఉద్దేశంతోనే మనం దానితో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకున్నాం. ఆ లక్ష్య సాధనకు చేసే కృషిలో అమెరి కాను ఇక ఎంతమాత్రం ‘వ్యూహాత్మక’, ‘విశ్వసనీయ’ భాగస్వామిగా పరిగణించడానికి లేదని ఇటీవలి పరిణామాలు, ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలు సూచిస్తున్నాయి.
మన రాజ్యాంగ సూత్రాలు, విలువలే మనల్ని ఒక ఉదారవాద, బహుళ సాంస్కృతిక, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా నిల బెడుతూ, ప్రపంచంలో మనకొక స్థాయిని కల్పిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రధాన దేశాలు అనుసరిస్తున్న సైనిక, ఆర్థిక విధానాలు భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు; ఉదారవాద, బహుళత్వ, సెక్యులర్ ప్రజాస్వామిక దేశంగా వర్ధిల్లేందుకు దోహదపడే ప్రపంచ పర్యావరణాన్ని సృష్టించేవిగా లేవు.
ఈ నేపథ్యంలో మనల్ని మనం ఎలా పరిపాలించుకుంటాం, ఎలా అభివృద్ధికి బాటలు పరచుకుంటామన్నది మరింత ముఖ్యమైన
అంశంగా పరిణమిస్తుంది. మనం దేశీయంగా అనుసరిస్తున్న విధానాలు ఆత్మనిర్భరత, ‘వికసిత్ భారత్’ లక్ష్యాల సాధనకు వీలు కల్పించేవిగా ఉన్నాయా? క్రమేపీ మత భావనలను పెంచుకుంటున్న పాలక వ్యవస్థ అనుస రిస్తున్న విధానాలు ఆర్థికాభివృద్ధిని మందగింపజేసేవిగా ఉన్నాయి. మన రాజ్యాంగం దేన్ని గొప్ప వ్యూహంగా వీక్షించిందో ఆ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నవిగా లేవు. సరిగ్గా ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం దేశ, విదేశాలలోని పరిణా మాలను మరింత దీర్ఘకాలిక దృష్టితో పరిశీలించవలసి ఉంది.
దేశీయ, ప్రపంచ పరిణామాలను వేటికవిగా తాత్కాలిక దృష్టితో చూడటంతోనే సమస్య వచ్చి పడుతోంది. అంతర్జాతీయ వ్యవస్థలో మౌలికమైన మార్పులు చోటుచేసుకుంటున్నప్పుడు, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు నిజంగా చేయూత నివ్వగల భాగస్వాములెవరో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కర్తవ్యం మన చేతుల్లోనే ఉంది. కానీ, బాహ్య వాతావరణం కూడా లెక్కకు వస్తుంది.
సంజయ బారు
వ్యాసకర్త జర్నలిస్ట్ – ప్రధానికి మాజీ మీడియా సలహాదారు


