ఒక నిశ్శబ్ద అవయవ బోధ | World Kidney Day 2026 | Sakshi
Sakshi News home page

ఒక నిశ్శబ్ద అవయవ బోధ

Mar 12 2026 9:10 AM | Updated on Mar 12 2026 9:10 AM

World Kidney Day 2026

మనిషి శరీరం ఒక అద్భుతమైన సాహిత్య సంపుటి. ప్రతి అవయవం ఒక కవిత. ప్రతి నాడి ఒక లయ. ప్రతి శ్వాస ఒక వాక్యం. ఈ జీవన కవితలోఅత్యంత నిశ్శబ్దంగా, అత్యంత కీలకంగా పనిచేసే రెండు చిన్న వాక్యాలు మన కిడ్నీలు. అవి తమ పని తాము మౌనంగా చేస్తూనే ఉంటాయి. రక్తాన్ని శుభ్రం చేస్తూ, ద్రవ సమతౌల్యాన్ని కాపాడుతూ, మన జీవితాన్ని నిటారుగా నిలబెడ తాయి. కానీ ఏదో ఒక రోజు ఆ నిశ్శబ్దం బద్దలయితే... అప్పుడు గ్రహిస్తాం జీవితం ఎంత సున్నితమైనదో!

కిడ్నీ వ్యాధి నెమ్మదిగా పెరుగుతుంది. మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించవు. మనం అలసటగా భావిస్తాం. సాధారణ సమస్య అనుకుంటాం. కానీ ఒక దశలో వైద్యుడి గదిలో కూర్చుని పరీక్షల నివేదికలు చూస్తున్నప్పుడు అర్థమవు తుంది... శరీరం ఒక మౌన సంకేతం ఇచ్చిందని; అయినా మనం గమనించ లేదని! పరిస్థితి విషమించిన స్థితిలో ఒక వెలుగు కనిపిస్తుంది. అది కిడ్నీ మార్పిడి అనే ఆశ! ఇది కేవలం ఒక శస్త్రచికిత్స కాదు. అది ఒక మానవీయ కథ. నా సహచరిలాగా ఎవరో ఒకరు తమ శరీ రంలోని ఒక భాగాన్ని దానం చేస్తారు. వారి ఔదార్యం వల్ల మన జీవితం మళ్లీ వెలుగులోకి వస్తుంది. ఆ క్షణం నుంచి జీవితం కొత్త అర్థాన్ని పొందుతుంది. ముందు సాధారణంగా కనిపించిన విష యాలు అప్పుడు అద్భుతంగా అనిపి స్తాయి. ఉదయం సూర్యోదయం చూడటం, కుటుంబంతో కలిసి కూర్చుని భోజనం చేయడం, వీధిలో నడవడం, మిత్రులతో నవ్వులు పంచుకోవడం... అన్నీ ఒక వరంలా అనిపిస్తాయి.

ప్రతి ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాకు మూడు విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది – ఆరోగ్యం మనకు కనిపించని సంపద. మనం దాన్ని గమనించేది అది దూరమైన తర్వాతే! రెండవది – అవయవదానం అనే మానవీయ మహత్తు. ఒకరి జీవితం మరొకరి చేతుల్లో పునర్జన్మ పొందుతుంది. మూడవది – అవగాహన. ఎందుకంటే కిడ్నీ వ్యాధుల్లో చాలా వాటిని ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు. సాధారణ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం... ఇవి చాలా చిన్న విషయాల్లా అనిపించవచ్చు. కానీ ఇవే మన జీవితాన్ని రక్షించేపెద్ద నిర్ణయాలు.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండో గురువారం ప్రపంచం ‘వరల్డ్‌ కిడ్నీ డే’ని గుర్తు చేసుకుంటుంది. కిడ్నీ వ్యాధి అనుభవించిన వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. (నాకు పునర్జన్మనిచ్చిన సహచరి ఇందిరకు ప్రేమతో...)
– వారాల ఆనంద్‌ ‘ కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత 

Advertisement
 
Advertisement
Advertisement