ఒత్తిళ్లకు జడ్జీలు లొంగిపోకూడదు! | Sakshi Guest Column Justice BV Nagaratna On Judges | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లకు జడ్జీలు లొంగిపోకూడదు!

Mar 9 2026 12:49 AM | Updated on Mar 9 2026 12:49 AM

Sakshi Guest Column Justice BV Nagaratna On Judges

ప్రసంగం

వలస పాలనకు వ్యతిరేకంగా అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించు కున్న స్వాతంత్య్రం ఫలితంగా భారత రాజ్యాంగం ఆవిర్భవించింది. రాజ్యాంగ తత్వాన్ని ప్రగాఢంగా గమనిస్తే అది చరిత్రను దృష్టిలో పెట్టుకుని సాగినదిగా తేలుతుంది. రాజ్యాంగం రూపొందుతున్న ప్పుడే అది పరివర్తనీయతను కూడా సంత రించుకుంది. చారిత్రక వారసత్వంగా వస్తున్న రెండు అన్యాయాలను అది చక్క దిద్దింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రాతినిధ్య ప్రజా స్వామ్యం మొదటి రూపాంతరీకరణకు గుర్తుగా నిలిచాయి. మరో విధంగా కూడా రాజ్యాంగం మార్పు తీసుకొచ్చింది. అది సమా జాన్ని పునర్నిర్మించింది. వేళ్లూనుకుని, విస్తరించి ఉన్న కుల, లింగ, వర్గ, జాతి తదితర వివక్షలను రూపుమాపింది. 

సామాజిక మార్పునకు పురిగొల్పే తత్వం
దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని 1996లో రూపొందిస్తున్నప్పుడు ‘పరివర్తనాత్మక రాజ్యాంగవాదం’ అనే పదబంధం పుట్టుకొచ్చింది. కాకతాళీయంగా, ఆ రాజ్యాంగం ఈ ఏడాదితో మూడు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది. ‘‘చట్టంలో నిర్దేశించిన అహింసాయుత రాజ్యాంగ ప్రక్రియల ద్వారా భారీయెత్తున సామాజిక మార్పునకు పురిగొల్పే సాహసిక తత్వానికి పరివర్తనాత్మక రాజ్యాంగవాదం దర్పణంగా నిలుస్తుంది’’ అని అమెరికన్‌ విద్యావేత్త కార్ల్‌ క్లేర్‌ అంటారు. మన రాజ్యాంగం సరిగ్గా అలాంటిదే. అది 1949 నవంబర్‌ 26న మనం స్వీకరించినప్పటి నుంచి అలాగే ఉంది.

మన రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని ఒక సజీవవృక్షంగా భావించారు. అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూపోతుంది. తరతరాలుగా అది నిలిచి ఉండాలని వారు కోరుకున్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, కోర్టుల ద్వారా మార్పు చోటు చేసుకుంటుందని మనందరికీ తెలిసిందే. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే మూడు భావనల ద్వారా భారత రాజ్యాంగ పరివర్తనాత్మక దార్శనికతను స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరాని తనం, లింగ అసమానతల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వలస పాలనానంతర భారత దేశం గుర్తించింది. సామాజిక మార్పునకు చట్టం ముఖ్య ఉత్ప్రేరకంగా ఉంటుందని గుర్తించబట్టే వివక్షకు తావు లేని విధంగా సార్వత్రిక సమానత్వ హక్కులకు రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది.

సౌభ్రాతృత్వం గురించి రాజ్యాంగ అవతారికలో స్పష్టంగా ప్రకటించారు. స్వేచ్ఛ, సమానత్వంతోపాటు సౌభ్రాతృత్వం కూడా సమసమాజ సాధనకు ఉపకరణంగా ఉంటుందని వారికి తెలుసు. పక్షపాతాలు, వివక్ష, ఆధిపత్య ధోరణి ఏనాటి నుంచో సమాజంలో ఉన్నవిగా చెప్పి తప్పించుకునే ప్రయత్నానికి అది అడ్డుకట్ట వేసింది. రాజకీయంగా ఒక సమూహంగా నిబద్ధులమై ఉండేందుకు అది సంకేతమిచ్చింది. మత విశ్వాసాలు, గుర్తింపులు, ఆచార విధానాలు ఆధిపత్య ధోరణికి లేదా పౌరులుగా ప్రత్యేక గుర్తింపునకు దారితీయడానికి లేదు. ప్రజాస్వామ్యం, దాని విలువలు మన సమాజంలో వేళ్ళూనుకునేటట్లు చేయడంలో అది గణనీయమైన పాత్ర వహించింది. 

పార్లమెంట్‌కు ఉన్న పరిధి
వ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడటం పరివర్త నాత్మక రాజ్యాంగవాద అత్యంత ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. నచ్చినట్లుగా వ్యవహరించే, ఎంచుకునే, అసమ్మతి వ్యక్తం చేసే స్వేచ్ఛ పౌరులకు ఉంది. సమష్టి లేదా ప్రజాహితం పేరుతో వ్యక్తి గత స్వేచ్ఛను నీరుగార్చకుండా చూసుకోవాలి. అయితే, రూపాంత రీకరణతోపాటు సంయమనం కూడా అవసరం. మార్పు పేరుతో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్నే మార్చేయకూడదు. రాజ్యాంగ పరంగానే అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ, ఆ అధికారాన్ని వినియోగించడంలో కొన్ని పరిమితులున్నాయని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. 

ఈ సిద్ధాంతానికి బీజావాపన స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్ళలోనే పడింది. భూ సంస్కరణలు అమలు జరిపి, జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని పార్లమెంట్‌ కోరుకున్నప్పుడు, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రాజ్యాంగంలోని 368వ అధికరణం ప్రాథమిక హక్కులతో సహా వేటికీ మినహాయింపు లేకుండా రాజ్యాంగాన్ని సవరించే హక్కును పార్లమెంటుకు దఖలు పరుస్తోందని శంకరీ ప్రసాద్‌ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. తదనంతరం సజ్జన్‌ సింగ్‌ కేసులో కూడా అదే ప్రస్ఫుటమైంది. 

కాకపోతే, రాజ్యాంగానికి కొన్ని ‘మౌలిక స్వరూప స్వభావాలు ఉన్నా’యని జస్టిస్‌ ముధోల్కర్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత, 1967లో గోలక్‌ నాథ్‌ కేసులో ప్రాథమిక హక్కులను పార్లమెంట్‌ సవరించడానికి లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. పార్లమెంట్‌ (1971లో) 24, 25, 29 సవరణల ద్వారా దాన్ని ఎదిరించే ప్రయత్నం చేసింది. ఈ వివాదం చరిత్రాత్మక కేశవానంద భారతి కేసుగా పరిణమించింది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉందికానీ, దాని మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.

న్యాయమూర్తుల ధర్మం
లిఖిత రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో సవరిస్తూపోతే అదొక సాధారణ శాసన రూపంగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అలాగని, అవసరమైనచోట కూడా సవరణలు చేపట్టకపోతే, కాలం చెల్లినదిగా తయారైపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా మౌలిక స్వరూప సిద్ధాంతం రాజ్యాంగం గుర్తింపును పరిరక్షిస్తూనే, అవసరమైన మార్పులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజ్యాంగాన్ని నీరుగార్చకుండా మౌలిక స్వరూప సిద్ధాంతం కాపాడుతోంది.  కానీ న్యాయ సమీక్ష లేకపోతే, మౌలిక స్వరూప సిద్ధాంతం కేవలం నినాదంగా మిగిలిపోతుంది. అధికారాల విభజన, న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ తన పాత్రను నిర్వర్తించగలుగుతుంది. 

రాజకీయంగా అప్రియమైనవైనా సరే, ఒక చట్టం చెల్లదని చెప్పగలిగే, ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును నిగ్రహించగలిగే స్వతంత్రత జ్యుడీషియరీకి ఉండాలి. అంతిమంగా, న్యాయమూర్తుల విశ్వాసం, తెగువ, స్వాతంత్య్రాలే గణనకు వస్తాయి. జ్యుడీషియల్‌ ధర్మాన్ని కాపాడతామని జడ్జీలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వృత్తి జీవితంలో ఎదురుకాగల పర్యవసానాలను లెక్క చేయకుండా న్యాయమూర్తులు ఆ ధర్మాన్ని పరిరక్షించాలి. లేకపోతే, న్యాయ సమీక్ష కేవలం ప్రతీకాత్మకమైనదిగా, వ్యక్తిగతంగా వెనుక ముందు లాలోచించుకుని చేసే పనిగా మిగిలిపోతుంది. 

న్యాయ పరిరక్షణ నిమిత్తం న్యాయమూర్తులంతా ఏకం కావాలి. ఎప్పుడైతే, స్వాతంత్య్రాన్ని కోల్పోతామో అప్పుడే మనం న్యాయమూర్తులుగా కొనసాగే హక్కును కోల్పోయినట్లు లెక్క. ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా ‘కుదరదు’ అని చెప్పగలగాలి. రాజకీయ ఒత్తిడి, సంస్థా పరమైన వేధింపులు లేదా పాపులర్‌ డిమాండ్ల నుంచి జడ్జి స్వేచ్ఛగా వ్యవహరించగలగాలి. ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛకూ, సమానత్వా నికీ అంకితమవ్వడమే! 

జస్టిస్‌ బి.వి. నాగరత్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement