స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి | Justice BV Nagarathna 10 Key Insights On Women Empowerment | Sakshi
Sakshi News home page

స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి

Mar 6 2026 5:36 AM | Updated on Mar 6 2026 5:36 AM

Justice BV Nagarathna 10 Key Insights On Women Empowerment

ఎంపవర్‌మెంట్‌ కుటుంబ బాధ్యతల నుంచి స్త్రీ సాధికారత వరకు, ఆధునిక కాలంలో కుటుంబ బంధాల నుంచి స్త్రీ శక్తి వరకు... జస్టిస్‌ బీవీ నాగరత్న ఏది మాట్లాడినా... 
అది ఆణిముత్యమే. ఆత్మావలోకన దృశ్యమే.  ఆమె మాటలు స్త్రీ సాధికారత, చైతన్యానికి వెలుగు బాటలు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా విముక్తి... మొదలైన విషయాలపై వివిధ సందర్భాలలో జస్టిస్‌ బీవీ నాగరత్న వెలువరించిన అభ్రిపాయాలు.

→ వివాహం లేదా ప్రసవం తరువాత మహిళలు తమ కెరీర్‌ను వదులుకోకూడదు. ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది మహిళలకు సంబంధించి పఠిష్టమైన భద్రతావలయం.

→ పురుషాధిక్య రంగాలలో మహిళల సంఖ్య పెరగడం ‘చొరబాటు’ కాదు. చారిత్రాత్మకంగా  వారికి నిరాకరించబడిన స్థలాలను తిరిగి పొందడం.

→ ప్రభుత్వ, చట్టపరమైన స్థానాల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండాలి.

→ భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే మొదటి అడ్డంకి... ఆడపిల్లగా పుట్టడమే!

→ ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–డేటా ప్రకారం 15–19 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లల్లో 59 శాతం మంది తగిన పోషకాహారం లేకుండా, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఆడపిల్లల అభ్యున్నతికి ఆటంకంగా మారవచ్చు.

→ బాలికలపై పెరుగుతున్న డిజిటల్, లైంగిక హింసను నిరోధించడానికి న్యాయ, చట్ట విధానాలను మరింత విస్తరించాలి. 2018–2022ల మధ్య పదివేలకు పైగా కేసులు నమోదైతే వాటిలో శిక్షార్హత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. సకాలంలో బాధితులకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి.

→ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేగంగా మార్పు చెందుతోంది. ఈ మార్పులు కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే కాదు న్యాయవ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం బలపడడం కూడా ఈ మార్పుల్లో ఒకటి. విద్య, ఉపాధి ద్వారా మహిళలు పొందే సామాజిక–ఆర్థిక విముక్తిని సమాజం సానుకూలంగా చూడాలి. ప్రోత్సహించాలి. అలాంటి మహిళలు కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే కాదు దేశశ్రేయస్సుకు కూడా దోహదపడతారు.

→ కోర్టులలో ఉన్న కుటుంబ వివాదాల్లో ఎక్కువ కేసులు రెండు పార్టీలు రెండు అడుగులు వేస్తే పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలలో ఒకరికొకరు ఆసక్తి, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు భార్యాభర్తలు ఎవరికి వారు అవతలి వ్యక్తి దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి.

→ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడానికి కారణం మహిళల ఆర్థిక, సామాజిక విముక్తి కాదు. మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన అభి్రపాయాలు, వైఖరులను మార్చుకోకపోవడమే.

→ మహిళలకు స్వతంత్రం ఇవ్వండి. సలహాలు, సూచనల నెపంతో వారిని నిరంతరం పర్యవేక్షించకండి. వారు స్వతంత్రంగా ఎదగడాన్ని కోరుకోండి. ఈ దేశ మహిళలందరూ అదే కోరుకుంటున్నారు.

→ వీధిలోకి వెళ్లినా, బస్సు లేదా రైల్వేస్టేషన్‌లో అడుగు పెట్టినా తన భద్రతకు సంబంధించిన ఆలోచనల భారాన్ని స్త్రీ మోయాల్సి ఉంటుంది. ఇల్లు, పని, సమాజంలో తన బాధ్యతలకు సంబంధించిన మానసిక భారానికి ఇది అదనపు భారం.
 

మిషన్‌ వాత్సల్య, మిషన్‌ శక్తి, బేటీ బచావోలాంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంలో పురోగతి సాధించాం. చెడుకు అడ్డుకట్ట వేసే ప్రతి నివారణ చర్య, రక్షణ వ్యవస్థ హాని చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాలికలు  అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని నిర్మిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement