మా సచ్ఛీలత రుజువైంది  | Delhi court discharged all 23 accused in the Delhi Liquor Scam case | Sakshi
Sakshi News home page

మా సచ్ఛీలత రుజువైంది 

Feb 28 2026 4:55 AM | Updated on Feb 28 2026 4:55 AM

Delhi court discharged all 23 accused in the Delhi Liquor Scam case

మద్యం కుంభకోణం తీర్పుపై కేజ్రీవాల్‌  

భావోద్వేగంతో మీడియా ముందు కంటతడి 

ఆప్‌ను అంతం చేసేందుకే తప్పుడు కేసు 

దేశ చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర 

దమ్ముంటే ఢిల్లీలో తక్షణం ఎన్నికలు పెట్టండి 

బీజేపీకి 10 సీట్లొస్తే రాజకీయ సన్యాసం  

ప్రధాని మోదీకి ఆప్‌ అధినేత సవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు తీర్పును ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (57) స్వాగతించారు. తాను, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియాతో పాటు తమ పార్టీ కరడుగట్టిన నిజాయితీకి మారుపేరని ఈ తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే ఢిల్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరపాలి. బీజేపీకి 10 సీట్లకు మించి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా’’అంటూ సవాలు విసిరారు! తీర్పు సమయంలో కేజ్రీవాల్‌ కోర్టులోనే ఉన్నారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. సిసోడియా ఆయన్ను ఓదార్చారు. అనంతరం కేజ్రీవాల్‌ గద్గద స్వరంతో మాట్లాడారు. ‘‘కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో అన్ని వ్యవస్థలూ నిరంతర దాడికి గురవుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి తీర్పు ఇవ్వడం ద్వారా జడ్జి గొప్ప సాహసం ప్రదర్శించారు’’అంటూ అభినందించారు. తనపై నమోదైన కేసును స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్రగా కేజ్రీవాల్‌ అభివర్ణించారు. 

ఆప్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుట్రపూరితంగా ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘నా నిజాయితీపై, పరువు ప్రతిష్టలపై తప్పుడు కేసుతో దాడి చేశారు. దేశంలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిని ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జైలుపాలు చేశారు. ఆప్‌ అగ్ర నేతలు ఐదుగురిని జైల్లో పెట్టారు. మాపై ఇష్టానికి బురదజల్లారు. టీవీల్లో నిరంతరం చర్చలు జరిపారు. కానీ ఇదంతా పూర్తిగా తప్పుడు కేసని ఇప్పుడు రుజువైంది. 

దేవుడు మాతో ఉన్నాడని నేనెప్పుడూ చెబుతూ వచ్చాను. ఇన్నేళ్లలో నేను సంపాదించుకున్నది నిజాయితీ ఒక్కటే’’అన్నారు. అధికారం కోసం దేశంతో, రాజ్యాంగంతో ఆటలాడొద్దని మోదీకి హితవు పలికారు. ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కాలుష్యం, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలెన్నో ఉన్నాయి. వాటిని పరిష్కరించి అధికారంలోకి రండి’’అని సూచించారు. మద్యం కుంభకోణం అభియోగాలకు సంబంధించి తమపై ఈడీ కేసులను కూడా కొట్టేయాలని కోర్టును కోరతామని అనంతరం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ చెప్పారు. 

మోదీకి ఏకైక అవకాశం... నన్ను చంపించడమే! 
జైలు నుంచి వచ్చాక తాను మౌనం వహించానని మాయమైపోయానని చాలామంది అన్నారని కేజ్రీవాల్‌ గుర్తు చేశారు. ‘‘నేను రాజకీయ నాయకున్ని కాదు. నేతలకు తోలు మందంగా ఉంటుంది. తిట్టినా పట్టించుకోరు. కానీ నన్ను అవినీతిపరుడంటే, జైల్లో పెడితే, నా కుటుంబాన్ని ఎద్దేవా చేస్తే కచ్చితంగా బాధపడతాను. అందుకే నా నిర్దోషిత్వం దేశానికి రుజువయ్యేదాకా మౌనం వహించాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు నా హృదయం మీదినుంచి పెద్ద భారం తొలగిపోయింది’’అన్నారు. ‘‘మోదీ నాపై పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించారు. జైల్లో పెట్టించారు. అయినా నన్నేమీ చేయలేకపోయారు. ఇక మోదీకి మిగిలిన ఆప్షనల్లా ఒక్కటే. నన్ను చంపించడం! లేదంటే నన్ను తట్టుకోవడం ఆయన వల్ల కాదు’’అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

ఆనందోత్సాహాలు 
తీర్పు అనంతరం కేజ్రీవాల్‌కు ఆయన నివాసంలో ఘనస్వాగతం లభించింది. భార్య సునీతను, పిల్లలను హత్తుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీలో 5, ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్‌ నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీగా గుమిగూడారు. హోలీ ముందే వచ్చిందంటూ డప్పులు మోగిస్తూ, మిఠాయిలు పంచుతూ, చిందులేస్తూ సందడి చేశారు. కేజ్రీవాల్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. తన భర్త నిజాయితీకి మారుపేరని సునీత అన్నారు.  

కొనసాగనున్న ఈడీ దర్యాప్తు 
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ‘‘ఇది స్వతంత్ర దర్యాప్తు. ఈ కేసులో ఇప్పటికే విశ్వసనీయమైన ఆధారాలు లభించాయి. కుంభకోణం తాలూకు మొత్తాలను ఎక్కడెక్కడికి ఎలా తరలించిందీ, వాటితో ఏమేం చేసిందీ ఇప్పటికే వివరంగా పొందుపరిచాం’’అని వారు తెలిపారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం ఈడీ తనంత తానుగా క్రిమినల్‌ కేసు పెట్టలేదు. పోలీస్, సీబీఐ ఇతర చట్టపరమైన సంస్థల ఫిర్యాదు ఆధారంగానే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా 2022 ఆగస్టు 22న ఈడీ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు ప్రకారం ప్రాథమిక కేసులో నిందితునికి విముక్తి లభిస్తే దాని ఆధారంగా నమోదైన మనీలాండరింగ్‌ కేసు కొట్టివేతకు గురైనట్టే. దీనిపై ఈడీ అభ్యంతరం లేవనెత్తుతోంది. మనీ లాండరింగ్‌ కేసులను స్వతంత్ర కేసులుగా పరిగణించాలని, ప్రాథమిక కేసు తీర్పుతో వాటిని ముడిపెట్టొద్దని వాదిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటిదాకా 8 చార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో 40 సంస్థల పేర్లను పేర్కొంది. కుంభకోణానికి కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్‌ నేతలు తదితరులతో కలిసి ఈ కుట్రకు తెర తీశారని ఆరోపించింది. కేజ్రీవాల్, సిసోడియా సహా 18 మందిని అరెస్టు చేసింది.

స్వాగతించిన విపక్షాలు 
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ తదితరులు నిర్దోషులంటూ కోర్టు ఇచ్చిన తీర్పును విపక్షాలు స్వాగతించాయి. మోదీ సర్కారు తప్పుడు ప్రచారానికి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి తీర్పును చెంపపెట్టుగా అభివరి్ణంచాయి. బీజేపీ మాత్రం ఈ అంశంపై ప్రజలు ఎప్పుడో రాజకీయ తీర్పు వెలువరించారంటూ స్పందించింది. 

ఊహించిన స్క్రిప్టే: కాంగ్రెస్‌ 
‘‘బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు. అవసరార్థం ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే పాము వంటిది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఎంతకైనా దిగజారుతుంది. గుజరాత్, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్‌ వంటి అవసరార్థ భాగస్వామ్య పార్టీ నేతలపై కేసులన్నీ క్రమంగా తెరచాటుకు వెళ్లిపోతాయి. ఇదంతా ఊహించిన స్క్రిప్టే’’ 
– కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా 

ప్రశ్నలు మిగిలే ఉన్నాయి: బీజేపీ 
‘‘మద్యం కుంభకోణానికి సంబంధించి పలు సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. మద్యం విధానం సరైనదే అయితే విచారణ మొదలవగానే ఎందుకు రద్దు చేసినట్టు? దీనిపై న్యాయప్రక్రియ ఇంకా ముగియలేదు. రుజువుల్లేవని మాత్రమే కోర్టు చెప్పింది. వాటిని కేజ్రీవాల్, సిసోడియా నాశనం చేశారని సీబీఐ ఇప్పటికే పలుమార్లు పేర్కొంది. ఈ కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు ఇప్పటికే రాజకీయ తీర్పు ఇచ్చేశారు. మీడియా ముందు కల్లబొల్లి ఏడ్పుల డ్రామాతో సానుభూతి పొందాలన్న కేజ్రీవాల్‌ ప్రయత్నాలు ఫలించబోవు. ఆయన బాలీవుడ్‌కు వెళ్తే మంచిది!’’ 
– ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ

న్యాయవ్యవస్థే సుప్రీం 
‘‘న్యాయవ్యవస్థే సుప్రీం. కనుక కోర్టు తీర్పును అంతా అంగీకరించాలి. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ పాత్రపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పుకు ముందు చేసినవి. ఆయన ఇకపై తన గురించి, సొంత పార్టీ గురించి కాకుండా సమాజం గురించి, దేశం గురించి పని చేయాలి’’ 
– సామాజిక కార్యకర్త అన్నాహజారే 

‘‘ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టు సరైన తీర్పు ఇచ్చింది. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఎంతలా దురి్వనియోగం చేస్తోందో ఈ తీర్పు మరోసారి చాటుతోంది. విపక్ష నేతలను తప్పుడు కేసులతో వేటాడుతున్నందుకు నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతలు దేశానికి క్షమాపణలు చెప్పాలి.  
– సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి 

‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ రాజకీయ ప్రతీకార క్రీడలో ఎలా పావులుగా మారుతున్నాయో చెప్పేందుకు ఇది మరో నిదర్శనం. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిని అందుకు పూర్తిస్థాయిలో బాధ్యులను చేయాలి. ఆ మేరకు నిబంధనలు రూపొందాల్సిన అవసరముంది.’’ 
– సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

‘‘తప్పుడు మద్యం కేసు వల్ల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఎంతో నష్టపోయింది. కనుక అక్కడ తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఈడీ, సీబీఐతో పాటు రాజ్యాంగ వ్యవస్థలను కూడా బీజేపీ చెరబడుతోంది. అవి ప్రధాని కార్యాలయం చెప్పినట్టల్లా ఆడుతున్నాయి.’’ 
– ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ 

‘‘అంతిమంగా సత్యమే గెలుస్తుందనేందుకు ఈ తీర్పు మరో నిదర్శనం.  
– పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ 

‘‘రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని కోర్టు తీర్పు మరోసారి రుజువు చేసింది. మేం అవినీతిపరులమని రుజువు చేసేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా సత్యమే గెలిచింది.’’ 
– ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా 

‘‘చివరికి సత్యమే గెలిచింది. మద్యం కేసు విచారణ సందర్భంగా మా పారీ్టపై విపరీతమైన ఒత్తిళ్లు కొనసాగాయి. ఆప్‌ నిప్పులాంటి పార్టీ అని అంతిమంగా తేలింది.’’ 
– ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి 
 

ఎప్పుడేం జరిగిందంటే... 
2021 నవంబర్‌:    నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం. 
2022 జూలై:    అందులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ఆదేశాలు. 
ఆగస్టు:    మద్యం కుంభకోణంపై కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ. 
సెపె్టంబర్‌:    మద్యం విధానాన్ని రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం. 
2023 మార్చి 8:    కవితకు ఈడీ సమన్లు. 
2023 అక్టోబర్‌:     మనీ లాండరింగ్‌ అభియోగాలపై కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు 
2024 మార్చి 15:    హెదరాబాద్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ. 
మార్చి 21:    కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ. 
మే 10:    లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు మధ్యంతర         బెయిల్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు. 
జూన్‌ 20:    కేజ్రీవాల్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు. 
జూన్‌ 21:    ఈడీ అభ్యర్థన మేరకు బెయిల్‌ను సస్పెండ్‌ చేసిన ఢిల్లీ హైకోర్టు. 
జూన్‌ 25:    కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధించిన హైకోర్టు. 
జూన్‌ 26:    జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను లాంఛనంగా అరెస్టు చూపించిన సీబీఐ. 
జూలై 12:    ఈడీ మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు             మధ్యంతర బెయిల్‌. సీబీఐ కేసు నేపథ్యంలో జైల్లోనే కేజ్రీవాల్‌. 
జూలై 17:    సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్‌. 
ఆగస్టు 5:    సీబీఐ అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు. 
ఆగస్టు 12:    హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన కేజ్రీవాల్‌. 
ఆగస్టు 27:    కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీం కోర్టు. 
సెప్టెంబర్‌ 11:    కేజ్రీవాల్‌ కస్టడీని సెపె్టంబర్‌ 25 దాకా పొడిగించిన ఢిల్లీ కోర్టు. 
సెప్టెంబర్‌ 13:    కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌. 
2026 ఫిబ్రవరి 12:    మద్యం కుంభకోణం కేసులో విచారణ ముగించి తీర్పు రిజర్వు చేసిన ఢిల్లీ కోర్టు.     
ఫిబ్రవరి 27:    కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మొత్తం 23 మంది నిందితులూ నిర్దోషులని కోర్టు తీర్పు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement