విశేషంగా ఆకట్టుకున్న వైమానిక దళం విన్యాసాలు
హాజరైన రాష్ట్రపతి ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జైసల్మేర్: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తన శక్తిసామర్థ్యాలు, పోరాట పటిమను మరోసారి ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చేపట్టిన మిషన్లను మళ్లీ కళ్లకు కట్టింది. ‘వాయుశక్తి’విన్యాసాల్లో భాగంగా శుక్రవారం రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఐఏఎఫ్ విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఒళ్లుగగుర్పొడిచే యుద్ధ విమానాల ప్రదర్శనలను స్వయంగా వీక్షించారు. థార్ ఎడారిలో భారత్–పాకిస్తాన్ సరిహద్దులోనే ఉదయం నుంచి రాత్రి దాకా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక ప్రదర్శన జరిగింది. శత్రువుల రన్‌వే, ఇంధన నిల్వ కేంద్రాలు, బంకర్లు, రాడార్ కేంద్రాలు, యుద్ధ ట్యాంకులు, సాయుధ కాన్వాయ్‌లు, కమ్యూనికేషన్ సెంటర్లు, ఉగ్రవాదుల శిబిరాలు, హ్యాంగర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను వైమానిక దాడుల్లో ఎలా ధ్వంసం చేస్తారన్నది ఐఏఎఫ్ జవాన్లు ప్రత్యక్షంగా చూపించారు.


