యువతలో మానసిక అనారోగ్యం! | Decline in Youth Mental Well-Being in World | Sakshi
Sakshi News home page

యువతలో మానసిక అనారోగ్యం!

Feb 28 2026 3:44 AM | Updated on Feb 28 2026 3:44 AM

Decline in Youth Mental Well-Being in World

18–34 ఏళ్లలోపు వారిలో అధికంగా సమస్యలు  

సేపియన్‌ ల్యాబ్స్‌ ‘గ్లోబల్‌ మైండ్‌ హెల్త్‌’నివేదికలో వెల్లడి  

84 దేశాలకు గాను భారత్‌కు 60వ స్థానం  

న్యూఢిల్లీ:  ఆధునిక కాలంలో కుటుంబ బంధాలు బలహీనపడడం, జీవన శైలి మారిపోవడం, స్మార్ట్‌ఫోన్లు యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కుంగుబాటుకు గురి చేస్తున్నాయి. ప్రపంచమంతటా ఈ పరిణామం నెలకొంది. భారత్‌ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 18 నుంచి 34 ఏళ్లలోపు యువతలో మానసిక అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. 

మానసిక ఆరోగ్య గణన(ఎంహెచ్‌క్యూ) ర్యాకింగ్‌లో 84 దేశాలకుగాను భారత్‌కు 60వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా చెందిన సేపియన్‌ ల్యాబ్స్‌ ‘గ్లోబల్‌ మైండ్‌ హెల్త్‌’పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. తాజాగా తమ నివేదికను విడుదల చేసింది. భారతీయ యువతలో మానసిక ఆరోగ్యం దిగవ స్థాయిలో ఉన్నట్లు తేలి్చచెప్పింది. దేశంలో 55 ఏళ్లు దాటిన పెద్దలతో పోలిస్తే 18–34 ఏళ్ల యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.  

→ సేపియన్‌ ల్యాబ్స్‌ అధ్యయనం ప్రకారం.. భారతీయ యువత సగటు ఎంహెచ్‌క్యూ స్కోర్‌ 33గా ఉంది. వారు ‘బాధల్లో ఉన్న, కష్టపడుతున్న’కేటగిరీలో నిలిచారు.  
→ 55 ఏళ్లు దాటిన పెద్దల సగటు స్కోర్‌ దాదాపు 100గా ఉండడం గమనార్హం. వారు ‘జీవితాన్ని చక్కగా నిర్వహించుకుంటున్న, విజయవంతమైన’
కేటగిరీలో ఉన్నారు.  

→ కోవిడ్‌–19 మహమ్మారి మొదలైన తర్వాత యువతలో మానసిక అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయని, వారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోలేదని సేపియన్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు, చీఫ్‌ సైంటిస్టు తార త్యాగరాజన్‌ చెప్పారు. 2019 నుంచి తాము అధ్యయనం కొనసాగిస్తున్నామని, 55 ఏళ్లు దాటినవారి మెంటల్‌ హెల్త్‌లో పెద్దగా మార్పులు లేవని వెల్లడించారు. వారి 
ఎంహెచ్‌క్యూ స్కోర్‌ స్థిరంగా ఉందని స్పష్టంచేశారు.  

→ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాల్లో పెద్దల కంటే 18–34 ఏళ్ల యువతే మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటోంది.  

→ చీకటి ఖండంగా భావించే ఆఫ్రికాలోని ఘన, నైజీరియా, జింబాబ్వే, కెన్యా, 
టాంజానియా తదితర దేశాల్లోని యువతలో మానసిక అనారోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే వారిలో మెంటల్‌ హెల్త్‌ మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.  

→ జపాన్, తైవాన్, హాంకాంగ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), చైనా యువతలో మెంటల్‌ హెల్త్‌ ఏమాత్రం బాగా లేదని అధ్యయనం తెలియజేసింది  

→ రెండేళ్లపాటు ఈ సర్వే నిర్వహించారు. 84 దేశాల్లో 10 లక్షల మందికిపైగా ప్రజలను ప్రశ్నించారు. ఇంటర్నెట్‌ ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో వేర్వేరు వయసులకు చెందినవారు ఉన్నారు. 
ఆధునిక జీవితం యువత మానసిక ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.  

→ సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యువతలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి మానసిక ఆరోగ్యం క్రమంగా దిగజారుతోంది.  

→ భారత్‌లో 18–34 ఏళ్ల యువతలో 64 శాతం మంది తాము కుటుంబ సభ్యులతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 55 ఏళ్లు దాటివారిలో 78 శాతం మంది ఇదే మాట చెప్పారు. ఆధికంగా ఆదాయం ఆర్జిస్తున్నవారి కంటే కుటుంబంతో కలిసి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారు.  

→ ప్రపంచవ్యాప్తంగా సగటున 14 ఏళ్లకు మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తుండగా, భారత్‌లో సగటున 16.5 ఏళ్లకు స్మార్ట్‌ఫోన్‌ వాడకం ప్రారంభిస్తున్నారు.  

→ ఇండియాలో 55 ఏళ్లు దాటినవారిలో కేవలం 11 శాతం మంది అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకుంటున్నారు. యువతలో మాత్రం ఏకంగా 44 శాతం మంది ఇలాంటి హానికర ఆహారం 
స్వీకరిస్తున్నారు.  

→ ప్రజల్లో మానసిక అనారోగ్య సమస్యలపై పశ్చిమ దేశాలు దృష్టి పెడుతున్నాయి. దీనిపై పరిశోధన, పరిష్కార మార్గాల కోసం ప్రతిఏటా నిధుల కేటాయింపులు పెంచుతున్నాయి. అమెరికా ప్రభుత్వం 2024లో ఇందుకోసం 2.2 బిలియన్‌ డాలర్లు వెచి్చంచింది. యూకే సైతం భారీగానే నిధులు ఖర్చుచేస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.  

→ మానసిక అనారోగ్యం విషయంలో కేవలం చికిత్సతో సరిపెట్టకుండా.. అందుకు మూల కారణం ఏమటన్నది పరిశోధిస్తున్నామని తార త్యాగరాజన్‌ తెలియజేశారు. కుటుంబ బంధాలు బలహీన పడడం, ఆధ్యాతి్మక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లకు బానిస కావడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించకుండా.. అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వంటివి యువతకు ముప్పుగా పరిణమిస్తున్నాయ ని వివరించారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మానసిక ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకోవాలని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement