పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు | Delhi court discharges Kejriwal and Sisodia and Kavitha in excise policy case | Sakshi
Sakshi News home page

పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు

Feb 28 2026 4:16 AM | Updated on Feb 28 2026 4:16 AM

Delhi court discharges Kejriwal and Sisodia and Kavitha in excise policy case

మీ ఆరోపణలకు ఆధారాల్లేవ్‌..  సీబీఐపై న్యాయస్థానం ఫైర్‌

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తదితరులకు ఊరట... క్లీన్‌చిట్‌ ఇచ్చిన ఢిల్లీ సీబీఐ కోర్టు 

ప్రైవేటు వ్యక్తులకు లాభం జరిగినా నేరంగా పరిగణించలేం

కోర్టులు ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవు 

అధికారులను వేధించడం వల్ల వ్యవస్థ కుప్పకూలుతుంది 

ప్రభుత్వ విధానాలపై క్రిమినల్‌ కేసులు పెట్టలేం

ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చా అన్నట్లు 

మీ దర్యాప్తు ఉంది... సీబీఐపై నిప్పులు చెరిగిన న్యాయస్థానం

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కవితలతో సహా మొత్తం 23 మందికి ఢిల్లీ సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. వారందరినీ ఈ కేసు నుంచి తప్పిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌ తదితరులపై మోపిన ఆరోపణలను నిరూపించేందుకు సీబీఐ తగిన ఆధారాలు చూపలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన, అమలులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని స్పష్టం చేసింది. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొంది. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మద్యం వ్యాపారులు కలిపి తాము కోరుకున్న వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కుట్ర పన్నారన్న సీబీఐ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.

నిందితుల మధ్య ముందస్తు ఒప్పందం, నేరపూరిత కుట్ర జరిగినట్లు రుజువు చేసే బలమైన ఆధారాలను ప్రాసిక్యూషన్‌ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రధానంగా దినేష్‌ అరోరా వంటి అప్రూవర్ల సాక్ష్యాలపై ఆధారపడి ఉందని, అయితే వారికి ఇతర స్వతంత్ర సాక్షుల మద్దతు లేదని, అందువల్ల వారి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఢిల్లీ సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది.  అదే రకంగా హోల్‌సేల్‌ లాభాల మార్జిన్‌ను 5% నుండి 12% కి పెంచడం అనేది విధానపరమైన నిర్ణయమే తప్ప, అది కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడానికే చేశారన్న ఆరోపణలకు సైతం తగిన ఆధారాలను చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవంది.

ప్రభుత్వ విధానం తప్పుగా ఉండటం నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో జరిగిందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదంది. పాలసీలో మార్పుల కోసం కేజ్రీవాల్‌ నేరుగా నగదు డిమాండ్‌ చేసినట్లు లేదా కుట్రలో పాల్గొన్నట్లు సీబీఐ చూపిన ఆధారాలు ‘అనుమానాల‘ స్థాయిలోనే ఉన్నాయని, అవి అభియోగాలు నమోదు చేయడానికి సరిపోవని కోర్టు పేర్కొంది. మద్యం పాలసీని మనీష్‌ సిసోడియా మార్చారని చెప్పలేమని, ఫైళ్ల కదలికలు, నోటింగ్స్‌ అన్నీ అధికారిక నిబంధనల ప్రకారమే ఉన్నాయని కోర్టు పేర్కొంది.

కల్వకుంట కవితను కీలక కుట్రదారుగా పేర్కొన్నప్పటికీ, ఆమె ద్వారా రూ.100 కోట్ల  ముందస్తు నగదు బదిలీ జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి సమర్పించిన ఆధారాలు ఎంత మాత్రం సరిపోవని, బలహీనంగా ఉన్నాయని కోర్టు భావించింది. విజయ్‌ నాయర్‌కు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేదని, పాలసీ రూపకల్పనలో ఇతను కీలక పాత్ర పోషించాడనడానికి తగిన ఆధారాలు లేవని ఢిల్లీ సీబీఐ కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన ఒక పద్ధతి ప్రకారం, వివిధ విభాగాల మధ్య చర్చల తర్వాత జరిగిందని తేల్చింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పర్యవేక్షణలోనే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. 

ఎన్నికల ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోలేవు...
ఎన్నికల రాజకీయ పార్టీలు ఖర్చు చేసే నిధుల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను పరిశీలించే ప్రాథమిక అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ’ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951’ కింద ’ఎన్నికల పిటిషన్‌’ దాఖలు చేసుకోవడమే చట్టబద్ధమైన మార్గమని కోర్టు పేర్కొంది.

అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్‌ చట్టం వంటి కఠినమైన చట్టాలను, ఎన్నికల చట్టాల పరిధిలోకి వచ్చే అంశాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యామ్నాయంగా వాడకూడదని కోర్టు తేల్చి చెప్పింది.  రాజకీయ ఆరోపణలను నేరాలుగా మార్చకూడదంది. ఒకవేళ దర్యాప్తు చేయాల్సి వస్తే.. అది ఎన్నికల చట్ట ఉల్లంఘనలకు సంబంధం లేకుండా, స్వతంత్రంగా రుజువయ్యే స్పష్టమైన నేరమై ఉండాలని  తెలిపింది. ఎన్నికల వేళ వచ్చే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, చట్ట పాలనను, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని సీబీఐ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

వ్యాపార అవకాశవాదం నేరం కిందకు రాదు...
ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ప్రైవేటు సంస్థలు అందులోని సడలింపులను వాడుకుని లాభపడాలని చూడటం సహజమని కోర్టు పేర్కొంది. ఇలాంటి ‘వ్యాపార అవకాశవాదం’ ఎప్పుడూ నేరం కిందకు రాదని తెలిపింది. ఒకవేళ నేరంగా పరిగణించాలంటే, అందులో మోసం, ఫోర్జరీ, లంచం, క్విడ్‌ ప్రో కో, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఖచ్చితంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

2002 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించిన సీబీఐ కోర్టు, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాల వల్ల ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరినా, అందులో దురుద్దేశం, చట్ట ఉల్లంఘన లేకుంటే వాటిని నేరంగా పరిగణించలేమని కోర్టు వివరించింది. ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లినంత మాత్రాన లేదా ఒక ప్రైవేట్‌ వ్యక్తి లాభపడినంత మాత్రాన దానిని నేరంగా పరిగణించలేమంది. అక్కడ అవినీతి, అక్రమ సంపాదన జరిగినట్లు ఆధారాలు ఉంటేనే అది నేరపూరిత చర్య అవుతుందని తెలిపింది.

విధానాల రూపకల్పన, అమలు బాధ్యత పాలకులదే...
ప్రజా విధానాలను రూపొందించడం, మార్చడం లేదా పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం అనేది పూర్తిగా శాసన కార్యనిర్వాహక వ్యవస్థల రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది.  ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు కాబట్టి, సామాజిక అవసరాలను గుర్తించే అధికారం శాసనకర్తలకు ఉంటుందని తెలిపింది. న్యాయస్థానాలు సాధారణంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవని గుర్తు చేసింది. ఒక కొత్త చట్టం లేదా విధానం వచ్చేటప్పుడు ప్రభుత్వం ఈ క్రింది అంశాలను పరిశీలిస్తుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను విశ్లేషించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించడం, పాత విధానం వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేయడం, ఆ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని చర్చించడం వంటి ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగం.

నిర్ణయాలను నేరపూరిత చర్యలుగా చూడకూడదు...
ప్రభుత్వం పాత విధానంలోని లోపాలను సవరించి కొత్త విధానాన్ని తెచ్చినప్పుడు, దాన్ని కేవలం ‘కుట్ర‘ లేదా ‘నేరపూరిత దురుద్దేశం‘తో చూడకూడదని సీబీఐ కోర్టు తెలిపింది. పాత విధానంలోని లోపాల వల్ల లాభపడిన వ్యక్తులు, కొత్త విధానంలోని మార్పులను అడ్డుకోవడానికి ఫిర్యాదులు, ఆరోపణలు చేయవచ్చునంది. కేవలం ఫిర్యాదుల్లో రాసిన భాషను బట్టి లేదా ఊహించిన కుట్రలను బట్టి విధాన నిర్ణయాలను నేరాలుగా పరిగణించడానికి వీల్లేదంది. నిజాయితీగా తీసుకున్న విధాన నిర్ణయాలను నేరపూరిత చర్యలు చూడరాదంది. ఇలాంటి చర్యల వల్ల పాలకులు గానీ,  ప్రభుత్వ అధికారులు గానీ కొత్త సంస్కరణలు తీసుకురావడానికి వెనకాడతారని తెలిపింది. పరిపాలనలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రారని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ఇలాంటి చర్యలు అడ్డుకుంటాయంది.

ప్రభుత్వ నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు విశ్లేషించజాలవు... 
సీబీఐ గానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించే అధికారం లేదని తెలిపింది. ఒక నిర్ణయం వల్ల ఆర్థికంగా లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా అని లెక్కలు వేయడం వారి పని కాదంది. ఆ నిర్ణయం పరిపాలనాపరంగా సరైనదా కాదా అని వారు తీర్పు చెప్పలేరంది.  ప్రభుత్వం ఒక పాలసీని ఎందుకు తెచ్చింది? అసలు ఆ పాలసీ అవసరమా? అని ప్రశ్నించే హక్కు కూడా వారికి లేదని తెలిపింది. దర్యాప్తు సంస్థల పని కేవలం చట్టం ప్రకారం నేరం జరిగిందా లేదా?‘ అని చూడటం మాత్రమేనంది.  ప్రభుత్వ నిర్ణయాల్లో మంచి చెడులు చూడటం దర్యాప్తు సంస్థల పని కాదని తేల్చి చెప్పింది.

ప్రైవేటు సంస్థకు లాభం కలిగినంత మాత్రాన అది నేరం అయిపోదు...
ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త విధానం వల్ల ఏదైనా ప్రైవేట్‌ సంస్థకు అనుకోకుండా లాభం చేకూరవచ్చునని, అంత మాత్రన అది నేరం అయిపోదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ప్రతి నిర్ణయాన్ని క్రిమినల్‌ కేసుగా మార్చడం మొదలుపెడితే, నిజాయితీగా పనిచేసే అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ కేసులో ఇరుక్కుంటామో అన్న భయంతో పాలన ఆగిపోతుందని తెలిపింది. రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకు, నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులను వేధించడం వల్ల వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వ విధానాలపై క్రిమినల్‌ కేసులు పెట్టలేవు...
ఒక అధికారి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి చెడు ఉద్దేశం లేనపపుడు అలాంటి వారిని శిక్షించడం తగదని తెలిపింది. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే, దర్యాప్తు సంస్థల అనవసరపు వేధింపుల నుండి వారికి రక్షణ ఉండాలని తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం సరైందా కాదా అనేది అసెంబ్లీ లేదా పార్లమెంటులో చర్చించాలే తప్ప, దానికి బదులుగా క్రిమినల్‌ చట్టాన్ని ఉపయోగించి ఆ విధానాన్ని ప్రశ్నించడం రాజ్యాంగ విరుద్ధమంది.  ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనే అంశంపై దర్యాప్తు సంస్థలు క్రిమినల్‌ కేసులు పెట్టలేవంది. అభివృద్ది చెందుతున్న ఓ దేశానికి అధికారుల నిర్ణయాలలో స్థిరత్వం, నిశ్చయత చాలా ముఖ్యమంది. ఏళ్ళ క్రితం  నిజాయితీతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు నేరాలుగా పరిగణించి విచారిస్తే, భవిష్యత్తులో ఏ అధికారి కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించడని తేల్చి చెప్పింది. ఆర్థిక విధానాల విషయంలో కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోకూడదని, అవి ప్రభుత్వ ప్రత్యేక పరిధిలోకి వస్తాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీబీఐ కోర్టు తన తీర్పులో ఉదహరించింది.

ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చుననే కోణంలో సీబీఐ దర్యాప్తు సాగింది...
ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరును మొదటి నుండి చివరి వరకు పరిశీలించిన తర్వాత, సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పింది. దర్యాప్తు అనేది నిష్పక్షపాతంగా జరగాలని, కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థ ఒక నిర్ణీత లక్ష్యంతో ముందే ఊహించుకున్న నేరారోపణలతో ముందుకు వెళ్లినట్లుగా కనిపిస్తోందని తెలిపింది. దర్యాప్తు సంస్థ తన దృష్టిని మధ్యలో మార్చుకుంటూ, ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చు అనే కోణంలో దర్యాప్తు సాగించిందని కోర్టు తెలిపింది. ప్రచార సంస్థలు , చిన్న వ్యాపారులు, అంగడియాలు (నగదు బదిలీ చేసేవారు), ఇంటి యజమానులు, హోటల్‌ నిర్వాహకులు, రాజకీయ కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలు చివరకు జాతీయ నాయకత్వాన్ని ఈ కేసులో ఇరికించారంది.

ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరిగి ఉంటుందన్న   ముందస్తు ఊహతో దర్యాప్తు సాగించిందని తెలిపింది. ఏ ఒక్క విభాగాన్ని వదలకుండా అందరినీ లాగాలన్న ఉద్దేశంతో ఈ దర్యాప్తు జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా దానిని అమలు చేసినప్పుడు అందులో నేరం ఉందని నిరూపించడానికి బలమైన సాక్ష్యం ఉండాలంది. కేవలం రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎవరికైనా లాభం చేకూరిందని భావించి, అందరినీ నేరస్తులుగా చిత్రించడం తగదని కోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యవస్థీకృత నేరం జరుగుతున్నప్పుడు, ఆ నేరాన్ని నడుపుతున్న అసలు వ్యక్తులను వదిలేసి, వారిని రాజకీయ లేదా ఉన్నత స్థాయి అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఉపయోగించుకోవడం సరైన దర్యాప్తు అనిపించుకోదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement