5 గంటలపాటు జనవాసాల్లో అలజడి
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో శుకవ్రారం ఉదయాన్నే ఓ గజరాజు అలజడి రేపింది. ఉదయం 5 గంటలప్పుడు నగర శివార్లలో కనిపించిన ఆ ఏనుగు 5 గంటలపాటు నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బిర్సా చౌక్, రాంచీ విమానాశ్రయం ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగును అటవీ సిబ్బంది ఉదయం 10 గంటల సమయానికి విజయవంతంగా అడవిబాట పట్టించగలిగారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి ప్రవేశించింది. ‘దారి తప్పిన ఆ ఏనుగు నగరంలోకి ప్రవేశించింది. ఉదయం వేళ చిన్నారులు స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం’అని రాంచీ డివిజన్ అటవీ అధికారి శ్రీకాంత్ వర్మ చెప్పారు. ఎటువంటి నష్టం జరగలేదన్నారు. హల్హు అటవీ ప్రాంతం నుంచి ధుర్వా వైపు తరచూ ఏనుగులు వస్తున్నాయని వివరించారు.
2024 జూన్‌లోనూ ఏనుగొకటి మొదటిసారిగా నగరంలోకి ప్రవేశించిందని గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోకి వచి్చందన్నారు. అదేవిధంగా, నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న రటులోని పాడుబడ్డ శీతల గిడ్డంగిలోకి రెండు ఏనుగులు ప్రవేశించాయన్నారు. 2013లోనూ రాంచీ సిటీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక ఏనుగు సంచరించిందని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏనుగుల దాడి ఘటనల్లో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని వర్మ తెలిపారు.


