తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్లోకి
క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌పై ఘనవిజయం
జంషెడ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఉత్తరాఖండ్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్ జట్టుతో ఇక్కడి కీనన్ స్టేడియంలో ఆదివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తరాఖండ్ జట్టు ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసుకుంది. 136 పరుగుల తేడాతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్ జట్టు ఒకదశలో 100/2తో పటిష్టంగానే కనిపించింది.
అయితే ఉత్తరాఖండ్ వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా మాయాజాలానికి... అభయ్ నేగి పేస్ ధాటికి జార్ఖండ్ జట్టు చివరి 8 వికెట్లను 30 పరుగుల తేడాలో కోల్పోయింది. చివరకు 130 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ (55; 6 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (34; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మయాంక్ మిశ్రా 22 పరుగులిచ్చి 5 వికెట్లు, అభయ్ నేగి 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఉత్తరాఖండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
అంతకుముందు మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 282/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ జట్టు 122.3 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటై 136 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కెపె్టన్ కునాల్ చండేలా (68; 8 ఫోర్లు), జగదీశ సుచిత్ (70; 6 ఫోర్లు), అభయ్ నేగి (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు.
కర్ణాటక లక్ష్యం 325
ముంబై జట్టుతో ముంబైలో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు విజయానికి 212 పరుగుల దూరంలో నిలిచింది. ముంబై నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60 బ్యాటింగ్; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
మయాంక్ అగర్వాల్ (3), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 189/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు 98.3 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటైంది. తనుశ్ కొటియాన్ (48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), తుషార్ దేశ్‌పాండే (47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా ముంబై జట్టు కర్ణాటకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కష్టాల్లో మధ్యప్రదేశ్
జమ్మూ కశ్మీర్ జట్టుతో ఇండోర్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ కష్టాల్లో పడింది. 291 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 204 పరుగులు చేయాలి.
ప్రస్తుతం శుభం శర్మ (11 బ్యాటింగ్), వెంకటేశ్ అయ్యర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జమ్మూకశ్మీర్ బౌలర్లలో ఆఖిబ్ నబీ 3 వికెట్లు, ఆబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 84/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు 70.3 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.


