యువ జట్టుకు ఘనస్వాగతం | Warm welcome to the Indian cricket team for the Under 19 World Cup | Sakshi
Sakshi News home page

యువ జట్టుకు ఘనస్వాగతం

Feb 9 2026 2:42 AM | Updated on Feb 9 2026 2:42 AM

Warm welcome to the Indian cricket team for the Under 19 World Cup

ముంబై: అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెట్‌ జట్టుకు ఘనస్వాగతం లభించింది. ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత అండర్‌–19 జట్టు జింబాబ్వే నుంచి ఆదివారం నేరుగా ముంబై చేరుకోగా... విమానాశ్రయం వద్ద ప్లేయర్ల కుటుంబ సభ్యులు, అభిమానులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో యువ భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. 

టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబర్చిన ‘యంగ్‌ ఇండియా’ ఆడిన ఆన్నీ మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో యువ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. విధ్వంసక ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే, హెడ్‌ కోచ్‌ కనిత్కర్‌పై పూల వర్షం కురిపించారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాం. ఇన్నాళ్ల నుంచి వాళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. 

ఆయుశ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అతడి శ్రమ ఫలించింది’ అని ఆయుశ్‌ మాత్రే తండ్రి యోగేశ్‌ మాత్రే అన్నారు. ఆరోసారి అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన వెంటనే జట్టుకు బీసీసీఐ ఏడున్నర కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించగా... త్వరలోనే ఆటగాళ్లను సన్మానించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరుగుతుండంతో... వీలును బట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో ఆటగాళ్లు ముంబై నుంచి స్వస్థలాలకు వెళ్లారు. 

‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ’లో వైభవ్‌ 
దుబాయ్‌: అండర్‌–19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ... ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ 14 ఏళ్ల ఓపెనర్‌... 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు లీగ్‌ 
దశలోనూ మెరుపులు మెరిపించిన వైభవ్‌... తుదిపోరులో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డులు దక్కించుకున్నాడు. 

వరల్డ్‌ కప్‌ ప్రదర్శన ఆధారంగా... ఐసీసీ ఆదివారం 12 మందితో కూడిన ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ను ఎంపిక చేసింది. అందులో భారత్‌ నుంచి వైభవ్‌ సూర్యవంశీ సహా ముగ్గురికి అవకాశం దక్కింది. కనిష్క్ చౌహాన్, హెనిల్‌ పటేల్‌ ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఆరోసారి ప్రపంచ టైటిల్‌ నెగ్గిన ‘యంగ్‌ ఇండియా’కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుశ్‌ మాత్రేకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. 

వరల్డ్‌కప్‌ రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్‌కు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఈ జట్టులో ఉండగా... ఇంగ్లండ్‌ సారథి థామస్‌ ర్యూ ఈ జట్టుకు వికెట్‌ కీపర్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్‌లో భారీ సెంచరీ బాదిన శ్రీలంక ప్లేయర్‌ విరాన్‌ చముదితకు కూడా ఈ జట్టులో చోటు దక్కగా... అఫ్గానిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఫైసల్‌ ఖాన్, నూరిస్తాని ఓమర్‌జాయ్‌ కూడా ఎంపికయ్యారు. 

ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌ నుంచి ఒక్కో ప్లేయర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. ఇయాన్‌ బిషప్, ఆండీ ఫ్లవర్, గ్రీన్‌వే, టెల్‌ఫోర్డ్‌తో కూడిన సెలెక్షన్‌ ప్యానల్‌ ఈ జట్టును ఎంపిక చేసింది. ఐసీసీ అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌: థామస్‌ ర్యూ (కెప్టెన్‌), బెన్‌ మైస్, లమ్స్‌డెన్‌ (ఇంగ్లండ్‌), వైభవ్‌ సూర్యవంశీ, కనిష్క్ చౌహాన్, హెనిల్‌ పటేల్‌ (భారత్‌), విరాన్‌ చముదిత (శ్రీలంక), ఫైసల్‌ ఖాన్, నూరిస్తాని ఒమర్‌జాయ్‌ (అఫ్గానిస్తాన్‌), ఒలీవర్‌ పీక్‌ (ఆ్రస్టేలియా), విటెల్‌ లావెస్‌ (వెస్టిండీస్‌), అలీ రజా (పాకిస్తాన్‌).   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement