నేపాల్ ఆఫ్ బ్రేక్ బౌలర్ షేర్ మల్లా చరిత్ర సృష్టించాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి బంతికే వికెట్ తీసి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను మల్లా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో సాధించడం మరింత ప్రత్యేకం.
మల్లాకు ముందు కేవలం ఐదుగురు (ఫిడేల్ ఎడ్వర్డ్స్, ప్రగ్యాన్ ఓఝా, పరాస్ ఖడ్కా, నదీమ్ అహ్మద్, ఖుర్రమ్ ఖాన్) మాత్రమే ప్రపంచకప్ టోర్నీలో (కెరీర్‌లో) తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలోనూ ఓ నేపాల్ బౌలర్ (పరాస్ ఖడ్కా) ఉన్నాడు. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. మల్లాకు ముందు మరో ముగ్గురు (పరాస్ ఖడ్కా, ఆరిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్) నేపాల్ ఆటగాళ్లు కూడా కెరీర్‌లో తొలి బంతికే వికెట్ తీశారు.
కాగా, టీ20 ప్రపంచకప్‌లో నేపాల్ ఇవాళ (ఫిబ్రవరి 8) ఆడుతుంది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జేకబ్ బేతెల్ (55), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు.
ఆఖర్లో విల్ జాక్స్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ 1, జోస్ బట్లర్ 26, టామ్ బాంటన్ 2, సామ్ కర్రన్ 2, జోఫ్రా ఆర్చర్ ఒక్క పరుగు చేశారు. నేపాల్ బౌలర్లలో నందన్ యాదవ్, దీపేంద్ర సింగ్ ఎయిరీ తలో 2 వికెట్లు తీయగా.. షేర్ మల్లా, సందీప్ లామిచ్చేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మల్లా తొలి వికెట్ ఫిల్ సాల్ట్.
అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. భుర్టెల్ (29), ఆసిఫ్ షేక్ (7) ఔట్ కాగా.. రోహిత్ పౌడెల్ (10), దీపేంద్ర సింగ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. డాసన్, జాక్స్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో నేపాల్ గెలవాలంటే మరో 78 బంతుల్లో 125 పరుగులు చేయాలి.


