భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం 105 మ్యాచ్‌ల్లోనే 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు.
ఈ జాబితాలో స్కై, విరాట్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్‌దీప్ సింగ్‌కు (22) దక్కుతుంది. విరన్‌దీప్ తర్వాతి స్థానాల్లో సికందర్ రజా (19), సూర్యకుమార్ (17) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు.


