ప్రపంచ 88వ ర్యాంకర్‌పై దక్షిణేశ్వర్‌ విజయం | Dakshineswar wins against the world number 88 ranked player | Sakshi
Sakshi News home page

ప్రపంచ 88వ ర్యాంకర్‌పై దక్షిణేశ్వర్‌ విజయం

Feb 8 2026 2:39 AM | Updated on Feb 8 2026 11:54 AM

Dakshineswar wins against the world number 88 ranked player

బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెదర్లాండ్స్‌ జట్టుతో జరుగుతున్న ఈ పోరులో మొదటి రోజు భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ ఓటమి చవిచూడగా... భారత నాలుగో ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ సురేశ్‌ సంచలన విజయం సాధించాడు. దాంతో తొలి రోజు ముగిశాక భారత్, నెదర్లాండ్స్‌ 1–1తో సమంగా నిలిచాయి. నేడు మూడు మ్యాచ్‌లు (డబుల్స్, రెండు సింగిల్స్‌) జరుగుతాయి. 

ప్రపంచ 162వ ర్యాంకర్‌ గయ్‌ డెన్‌ ఉడెన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 281వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ 0–6, 6–4, 3–6తో ఓడిపోయాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. ప్రపంచ 88వ ర్యాంకర్‌ జెస్పెర్‌ డి జాంగ్‌తో జరిగిన రెండో సింగిల్స్‌లో ప్రపంచ 465వ ర్యాంకర్‌ దక్షిణేశ్వర్‌ అద్భుత ఆటతీరుతో మెరిపించాడు. 

88 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ 6–4, 7–5తో జెస్పెర్‌ను బోల్తా కొట్టించాడు. దక్షిణేశ్వర్‌ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. నేడు జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో సాండెర్‌ అరెండ్స్‌–డేవిడ్‌ పెల్‌ జోడీతో యూకీ బాంబ్రీ–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం ఆడుతుంది. అనంతరం రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో జెస్పెర్‌తో సుమిత్, ఉడెన్‌తో దక్షిణేశ్వర్‌ తలపడతారు.  

Advertisement
 
Advertisement
Advertisement