dakshineswar
-
నయా రాకెట్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... గతేడాదే డేవిస్‌కప్‌లో అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే బోణీ కూడా కొట్టాడు. అయినా మనకెవరికీ తెలియదు. తాజాగా తెలిసింది. తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. గూగుల్‌లో ఎవరీ దక్షిణేశ్వర్ అని సెర్చ్ చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల కంటపడుతున్న అతను ఏం చేశాడో చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే అతనొక సంచలనం. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్–1లో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడితే... తలపడింది... ఎదురుపడింది... ఎదుర్కొని గెలిపించింది మాత్రం దక్షిణేశ్వరే! ఇందులో ఏ మాత్రం అతిశయోక్తే లేదు. పోటీ... నైపుణ్యం నిండిన ప్రస్తుత కాలంలో దక్షిణేశ్వర్ ముమ్మాటికి ఓ నిశ్శబ్ద చాంపియన్. జూనియర్ సర్క్యూట్, ఏటీపీ చాలెంజర్... ఐటీఎఫ్ ... ఇలా ఎన్నో పేర్లతో టోర్నీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అన్నింటా ఆడుతూనే ఉన్నా... ఏ టోర్నీలోనూ కంటబడని తమిళనాడు యువతార ఏకంగా చాంపియన్‌గా బయటపడటమే పెద్ద విశేషం. ఒకప్పుడు ఆట కోసం కిట్ బ్యాగులు మోసిన భుజాలే ఇప్పుడు డేవిస్ కప్‌లో భారత బాధ్యతల్ని మోస్తున్నాయి. ఎంతో క్రమశిక్షణతో కూడిన అతని శిక్షణ, పోటీలు, విజయాలు ఇవన్నీ కూడా గమనించిన వారికి ముచ్చటేయకుండా ఉండదు. పొద్దెక్కముందే ట్రెయినింగ్... మధ్యలో పోటీలు... పిడికిలి బిగిస్తే విజయాలు అన్నీ కూడా ఓ క్రమపద్దతిలో కష్టపడితేనే వచ్చాయి. ఓపికగా, ఒద్దికగా అన్నింటిని భరించిన దక్షిణేశ్వర్ ఈ క్రమంలో క్రీడా జర్నలిస్టుల ప్రాధాన్యంలోనూ లేడు. కానీ ఒక్కసారిగా సంచలన విజయాలతోనే అందరి కళ్లముందుకు వచ్చాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రకారమైతే డేవిస్‌కప్‌లో భారత జట్టు తరఫున నంబర్‌వన్ సుమిత్ నగాల్ తర్వాత ఆర్యన్ షా, కరణ్ సింగ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి. అయితే భారత నాలుగో ర్యాంకర్‌గా ఉన్న దక్షిణేశ్వర్ ఆటతీరుపై నమ్మకంతో భారత జట్టు నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ ఈ తమిళనాడు పొడగరికి ఏకంగా మూడు మ్యాచ్‌లు (సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్) ఆడే అవకాశం ఇచ్చాడు. రోహిత్ రాజ్‌పాల్‌తోపాటు భారత టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంచనాలకు మించి రాణించిన దక్షిణేశ్వర్‌కు భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. తొలినాళ్ల ప్రయాణమిది తమిళనాడులోని దిండిగుల్ పట్టణానికి చెందిన దక్షిణేశ్వర్ తండ్రి సురేశ్ ఎక్కా కూడా టెన్నిస్ ప్లేయరే! రాష్ట్రానికి, దేశానికి ఆడలేదు కానీ క్లబ్ లెవెల్ ఆటగాడు సురేశ్. బహుశా ఈ మూలాలే దక్షిణేశ్వర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయేమో! చెన్నైలోని కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి శిక్షణలో ఓనమాలు, తర్వాత మెలకువలు నేర్చుకొని రాటుదేలాడు. 2010 నుంచి 2016 వరకు తన ఉండే ఊరి నుంచి 16 కిలోమీటర్లు కిట్ బ్యాగులు మోసుకొని చెన్నై వెళ్లి చక్రవర్తి ఇచ్చే రోజువారీ శిక్షణ ముగించుకొని తిరిగి బస్సులో ఇంటికి చేరేవాడు. నిండా పదేళ్లు (9) లేకపోయినా సురపేట్ నుంచి మొగప్పాయిర్, అక్కడి నుంచి అన్నా నగర్, అటుపై లయోలా కాలేజ్ అతని టెన్నిస్ శిక్షణ సాగేదని కోచ్ చక్రవర్తి వివరించారు. ‘అదేంటో ఏమో దక్షిణేశ్వర్ బాల్యం నుంచే ఎవరితోనైనా సరే ఆడేందుకు ఇష్టపడేవాడు. కష్టపడేందుకు, నేర్చుకునే క్రమంలో ఆడిగేందుకు సిగ్గుపడడు. కానీ తన పనిమాత్రం నింపాదిగా, నిశ్శబ్దంగానే చేసుకునేవాడు. అతనిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పెప్సీ, కోక్లాంటి కూల్‌డ్రింక్స్ తాగేవాడే కాదు. కఠినమైన క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అవకాశాలేమో పరిమితంగా వస్తే, ఆర్థిక సమస్యలు అపరిమితంగా చుట్టిముట్టినా కూడా క్రమశిక్షణతోనే అధిగమించాడు. 2016లో ఫ్రాన్స్‌లో శిక్షణకు వెళ్లాడు. ఆ తర్వాతే అండర్–16 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచాడు’ అని 65 ఏళ్ల కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి తన శిష్యుడి ప్రయాణం చెబుతూ మురిసిపోయారు. ప్రస్తుతం అమెరికాలో... దక్షిణేశ్వర్ ఆటలో క్రమంగా రాటుదేలుతున్నా... చదువెందుకని ఏనాడు అనుకోలేదు. ఆటలో కష్టపడ్డట్లే ఉన్నత విద్య కోసం కూడా అంతే క్రమశిక్షణతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ‘వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ’లో కమ్యూనికేషన్స్ విద్యను అభ్యసిస్తున్న అతని చదువు ఈ ఏడాది మే నెలలో పూర్తవనుంది. ఆ తర్వాత పూర్తిగా టెన్నిస్‌పైనే దృష్టి సారించనున్నాడు. దీంతో మరిన్ని విజయాలతో 470వ ర్యాంకులో ఉన్న ఈ తమిళనాడు ప్లేయర్ నిలకడైన విజయాలు సాధిస్తే మరో ఏడాది తిరిగేసరికి టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏడాది గడిచే సరికి...గతేడాది డేవిస్ కప్‌లో భారత్... స్విట్జర్లాండ్‌తో ఆడింది. 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆడిన భారత డేవిస్ బృందంలో దక్షిణేశ్వర్ ఉన్నాడు. బరిలోకి దిగి సింగిల్స్‌లో గెలిచాడు. అలా భారత్ విజయంలో దక్షిణేశ్వర్ పాత్ర ఉంది. ఏడాది తిరిగేసరికి 22 ఏళ్ల క్రితం లియాండర్ పేస్ రికార్డునే సమం చేసిన ఘనత దక్షిణేశ్వర్ది! 2004లో జపాన్‌పై పేస్ 3 మ్యాచ్‌లాడి పేస్ గెలిపించాడు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత దక్షిణేశ్వర్ నెదర్లాండ్స్‌తో తొలి సింగిల్స్ ఆడి గెలిచాడు. రెండో రోజు డబుల్స్, రివర్స్ సింగిల్స్ వరుసగా ఆడి కూడా గెలిపించాడు. పేస్ తర్వాత... దక్షిణేశ్వర్ కంటే ముందు... సోమ్‌దేవ్, విష్ణువర్ధన్, సాకేత్ మైనేని, సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ, గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ ఇలా ఎంతోమంది వచ్చారు. మెరుగైన ర్యాంకింగ్స్‌లో నిలిచారు. డేవిస్ కప్ ఆడారు. కానీ దక్షిణేశ్వర్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడినా... భారత్‌ను ముందుండి గెలిపించే ప్రదర్శనైతే చేయలేదు. -
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగాళ్ల ర్యాంక్‌లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్ సురేశ్... ప్రపంచ సింగిల్స్‌లో 465వ ర్యాంక్... భారత్‌లో నాలుగో ర్యాంక్... ప్రపంచ డబుల్స్‌లో 457వ ర్యాంక్... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్ భారత్‌కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్‌కప్ పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో టీమిండియా వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. 2004లో జపాన్ జట్టుపై లియాండర్ పేస్ తర్వాత భారత్ నుంచి ఒక ప్లేయర్ రెండు సింగిల్స్‌లో, ఒక డబుల్స్‌లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్ ఆదివారం ముందుగా డబుల్స్ మ్యాచ్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్, ప్రపంచ 20వ ర్యాంకర్ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణేశ్వర్–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీని ఓడించింది. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్ సింగిల్స్ తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన రివర్స్ సింగిల్స్ రెండో మ్యాచ్‌లో దక్షిణేశ్వర్ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్‌ను ఓడించి భారత్‌కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. -
ప్రపంచ 88వ ర్యాంకర్‌పై దక్షిణేశ్వర్ విజయం
బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్న ఈ పోరులో మొదటి రోజు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ఓటమి చవిచూడగా... భారత నాలుగో ర్యాంకర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలన విజయం సాధించాడు. దాంతో తొలి రోజు ముగిశాక భారత్, నెదర్లాండ్స్ 1–1తో సమంగా నిలిచాయి. నేడు మూడు మ్యాచ్‌లు (డబుల్స్, రెండు సింగిల్స్) జరుగుతాయి. ప్రపంచ 162వ ర్యాంకర్ గయ్ డెన్ ఉడెన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 281వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 0–6, 6–4, 3–6తో ఓడిపోయాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ జెస్పెర్ డి జాంగ్‌తో జరిగిన రెండో సింగిల్స్‌లో ప్రపంచ 465వ ర్యాంకర్ దక్షిణేశ్వర్ అద్భుత ఆటతీరుతో మెరిపించాడు. 88 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో దక్షిణేశ్వర్ 6–4, 7–5తో జెస్పెర్‌ను బోల్తా కొట్టించాడు. దక్షిణేశ్వర్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్ జోడీతో యూకీ బాంబ్రీ–శ్రీరామ్ బాలాజీ ద్వయం ఆడుతుంది. అనంతరం రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో జెస్పెర్‌తో సుమిత్, ఉడెన్‌తో దక్షిణేశ్వర్ తలపడతారు. -
దీదీ కావాలా.. లాకెట్ కావాలా..!
బెంగాల్ ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినిపిస్తోంది. ‘మీకు దీదీ కావాలా లాకెట్ కావాలా’ అని. దీదీ అంటే మమతా బెనర్జీ. లాకెట్ అంటే లాకెట్ చటర్జీ. గత ఐదేళ్లుగా బిజెపిలో పని చేస్తూ ఎం.పిగా గెలిచి ఇప్పుడు కీలకమైన ఎన్నికలు అయినందున అసెంబ్లీ బరిలో దిగిన లాకెట్ చటర్జీ అన్నీ అనుకున్నట్టుగా అయితే బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి అని కొందరు జోస్యం చెబుతున్నారు. బెంగాల్లో మహా శక్తి అయిన మమతా బెనర్జీని ఈ మాజీ నటి సమర్థంగా ఎదుర్కొంటూ వార్తల్లో నిలవడం విశేషమే. పాపులర్ విన్యాసాల ద్వారా జనాన్ని ఆకర్షిస్తున్న ఈ మహిళా నేత పరిచయం... కళాకారులకు జనాకర్షక పద్ధతులు బాగానే తెలుస్తాయి. ఎలక్షన్లలో దిగిన సినిమా తారలు తమ అయస్కాంత శక్తితో సగటు ఓటరును గట్టిగా లాగగలరనేదానికి లాకెట్ చటర్జీ కూడా ఒక ఉదాహరణే. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బి.జె.పి తరఫున ఎవరైనా గట్టి మహిళా నాయకురాలు ఉందంటే అది ఈ లాకెట్ చటర్జీనే. బెంగాల్‌కు మహిళా ముఖ్యమంత్రి పని చేసే ఆనవాయితీని కొనసాగించాలని బి.జె.పి అనుకుంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ పార్టీ గెలిస్తే లాకెట్ చటర్జీ రసగుల్లా విరిగి పాకంలో పడ్డట్టే. ఎందుకంటే ఆమెకు మాత్రమే ఆ పార్టీ తరఫున మహిళా సి.ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరీ లాకెట్ చటర్జీ లాకెట్ చటర్జీది కోల్‌కతా ఉత్తర ప్రాంతంలో ఉండే దక్షిణేశ్వర్. ఇక్కడ కూడా ఒక కాళీ ఆలయం ఉంది. ఆమె తండ్రి అందులో పురోహితుడుగా పని చేసేవాడు. లాకెట్ చటర్జీకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి ఏర్పడింది. భరత నాట్యం, కథక్ నేర్చుకుని బెంగాల్ నటి మమతా శంకర్ ట్రూప్‌లో 13 ఏళ్ల వయసులోనే చేరి ప్రదర్శనలు మొదలెట్టింది. ఒక వైపు దక్షిణేశ్వర్లో చదువుకుంటూనే సినిమాల్లో ప్రవేశించింది. దాదాపు 35 సినిమాల్లో నటించింది. అయితే అవన్నీ ద్వితీయ శ్రేణి సినిమాలు అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద తారాగణం ఉండే భారీ సినిమాలు ఆమెకు దక్కలేదు. ఆమె నటించిన ఒక సినిమా తెలుగు డబ్బింగ్‌తో యూ ట్యూబ్‌లో ఉంది. సినిమా రంగంలో తన ప్రస్తావనను ముగించి ఆమె 2015లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరింది. అయితే కొద్దిరోజులకే అక్కడ ఇమడలేక బయటకు వచ్చి బి.జె.పిలో చేరింది. 2016లో ప్రత్యక్ష ఎన్నికలలో... 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్లలో బి.జె.పి తరఫున మాయురేశ్వర్ నుంచి లాకెట్ చటర్జీ నిలబడింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అయినప్పటికీ బి.జె.పి ఆమెను 2019 పార్లమెంట్ ఎలక్షన్లలో ‘హుగ్లీ’ నియోజకవర్గం నుంచి నిలబెడితే ఆశ్చర్యకరంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ 18 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటికి బి.జె.పి ఇప్పుడు లాకెట్‌ను ప్రచార కార్యదర్శి చేసింది. అంతే కాదు ‘చిన్సుర’ (చుచుర) నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఏ అభ్యర్థి గా నిలబెట్టింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి లాకెట్ రేయింబవళ్లు కష్టపడుతోంది. సైకిల్ ప్రచారం లాకెట్ చటర్జీ విభిన్న ప్రచార రీతులను పాటించడంలో సమర్థురాలు. తాను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినప్పుడు పూర్తి ప్రచారాన్ని సైకిల్ మీద, స్కూటర్ మీద నిర్వహించింది. ఇప్పుడు కూడా సైకిల్ మీద ఎక్కువగా తిరుగుతూ పార్టీ కోసం ప్రచారం చేస్తోంది. అవసరమైన చోట కార్యకర్తలతో కలిసి పోలీసుల మీద, ప్రత్యర్థుల మీద కలబడిన రికార్డు ఆమెకు ఉంది. ప్రస్తుతం హుగ్లీ నది మీద పడవలో తిరుగుతూ ఆమె పడుతున్న శ్రమ ఓటర్ల దృష్టిలోనే కాదు మీడియా దృష్టిలో కూడా పడుతోంది. సొంతగా చేతితో రాసిన పోస్టర్లను విడుదల చేసి తృణమూల్‌తో ఐసల్ ఫైసల్ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. మమతాపై దాడి లాకెట్ చటర్జీని మమతాపై దాడికి పార్టీ ఎక్కువ ఉపయోగించుకుంటోంది. లాకెట్ కూడా సమర్థమైన వాదనే ఓటర్ల ముందు వినిపిస్తోంది. ‘స్త్రీలు తమకేదైనా మేలు జరుగుతుందని మహిళా సి.ఎంగా మమతా బెనర్జీని ఎన్నుకున్నారు. రెండుసార్లు పదవి ఇచ్చారు. కాని ఆమె వారి కోసం ఏమీ చేయలేదు. పశ్చిమ బెంగాల్లో ఉమెన్ ట్రాఫికింగ్ అత్యధికంగా ఉంది. గృహ హింస ఎక్కువ గా ఉంది. యాసిడ్ దాడులైతే దేశంలోనే బెంగాల్లో అత్యధికం. కిడ్నాప్ కేసులకు అతీగతీ లేదు. ఇవన్నీ మమతా బెనర్జీ వైఫల్యాలు. స్త్రీలు ఇవన్నీ గమనించారు. వారు ఈ.వి.ఎంల ద్వారా తమ ప్రతీకారం తీర్చుకుంటారు’ అని లాకెట్ తన ప్రచారంలో మాట్లాడుతూ ఉంది. అవతలి వైపు అయితే అవతలి వైపు నుంచి చూస్తే లాకెట్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము. హుగ్లీ నదిపై ఆధునిక ఘాట్ కట్టి వారణాసిలోలాగా హారతి కార్యక్రమం చేస్తామని ఆమె చేస్తున్న హామీలు ఆకర్షిస్తున్నా మాకు ఉపాధి కావాలి అనే యువతే ఆమెకు ఎక్కువగా ఎదురు పడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అభివృద్ధి చేసిందో చేయలేదో బి.జె.పి వస్తే మొత్తం వాతావరణం దెబ్బ తింటుందని భయపడుతున్నాం అనేవారూ ముఖ్యంగా పై వయసు వారు ఆమె ప్రచార పరిధిలో కనిపిస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ ప్రచారంలో జూన్ మలియా, కౌషాని ముఖర్జీ, లౌలీ మైత్ర వంటి ఈకాలపు తారలను రంగంలో దించి ఉంది. హోరాహోరీగా సాగుతున్న ఈ పోటీలో విజేతలెవరో అన్న ఉత్కంఠ తప్పక నెలకొని ఉంది. ఎవరు గెలిచినా బెంగాల్ మళ్లీ మహిళా సి.ఎంనే చూస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
దక్షిణేశ్వర్ కు మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం దక్షిణేశ్వర్‌లోని కాళీ మందిర్ ఆలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉన్న ఆయన ప్రస్తుతం అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ ఆలయ సందర్శన అనంతరం ఆయన బేలూర్ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో మఠం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తారు. మోదీ కొన్నాళ్లపాటు మఠంలో ఉన్నారు.


