దక్షిణేశ్వర్‌ ధమాకా | Indias sensational victory over the Netherlands | Sakshi
Sakshi News home page

దక్షిణేశ్వర్‌ ధమాకా

Feb 9 2026 2:53 AM | Updated on Feb 9 2026 2:53 AM

Indias sensational victory over the Netherlands

డబుల్స్‌తోపాటు రివర్స్‌ సింగిల్స్‌లో గెలుపు

నెదర్లాండ్స్‌పై భారత్‌ సంచలన విజయం

డేవిస్‌ కప్‌లో వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌కు అర్హత

బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్‌ ఆటగాళ్ల ర్యాంక్‌లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్‌ సురేశ్‌... ప్రపంచ సింగిల్స్‌లో 465వ ర్యాంక్‌... భారత్‌లో నాలుగో ర్యాంక్‌... ప్రపంచ డబుల్స్‌లో 457వ ర్యాంక్‌... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్‌ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్‌ భారత్‌కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. 

ఫలితంగా డేవిస్‌కప్‌ పురుషుల ప్రపంచ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టీమిండియా వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. 2004లో జపాన్‌ జట్టుపై లియాండర్‌ పేస్‌ తర్వాత భారత్‌ నుంచి ఒక ప్లేయర్‌ రెండు సింగిల్స్‌లో, ఒక డబుల్స్‌లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్‌ ఆదివారం ముందుగా డబుల్స్‌ మ్యాచ్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్, ప్రపంచ 20వ ర్యాంకర్‌ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 

3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్‌ అరెండ్స్‌–డేవిడ్‌ పెల్‌ జోడీని ఓడించింది. దాంతో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్‌ సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్‌ జెస్పెర్‌ డి జాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. 

నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన రివర్స్‌ సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్‌ గయ్‌ డెన్‌ ఉడెన్‌ను ఓడించి భారత్‌కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement