జార్ఖండ్‌: అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్లు.. | Jharkhand Student Protest: Assembly March Over Exam Irregularities | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌: అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్లు..

Aug 10 2026 10:42 AM | Updated on Aug 10 2026 1:14 PM

Jharkhand Student Protest: Assembly March Over Exam Irregularities

రాంచీ: ఝార్ఖండ్‌లో నియామక పరీక్షల అక్రమాలను నిరసిస్తూ సోమవారం వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర శాసనసభ ముట్టడికి యత్నించారు. పురాతన అసెంబ్లీ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనను జగన్నాథ ఆలయం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. నిరసనకారులను నియంత్రించడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్‌కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిరసన ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం దిగివచ్చి, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షతో పాటు 2023, 2025లో నిర్వహించిన బ్యాక్‌లాగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. అయితే, జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌పై విద్యార్థులు పట్టువీడలేదు.

ప్రభుత్వ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై జరుగుతున్న నిరసనల నడుమ సోమవారం రాంచీలో హైడ్రామా చోటుచేసుకుంది. పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఆదిత్య సాహు, బాబూలాల్ మరాండీతో సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆందోళనకారులు శాంతియుతంగా అసెంబ్లీని ముట్టడించేందుకు (ఘెరావ్) అసెంబ్లీ వైపు మార్చ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్‌కేఎం నేత దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌లో వచ్చి జార్ఖండ్ అసెంబ్లీ వైపు సాగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎలాంటి హింసకు తావులేకుండా శాంతియుతంగా, రాజ్యాద్ధబద్ధంగా ఈ మార్చ్ కొనసాగుతుందని విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జార్ఖండ్ పోలీసులు నిషేధాజ్ఞలు (ప్రొహిబిటరీ ఆర్డర్లు) జారీ చేయడంతో పాటు, నగరవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనలో పాల్గొనే విద్యార్థులు ఎలాంటి హింసాత్మక ప్రదర్శనలకు పాల్పడవద్దని రాంచీ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. 
 

జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో, సోమవారం రాంచీలో రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని, ఈ పరిణామాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పరీక్ష జరిగినందున సీబీఐ విచారణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 

విద్యాద్ధుల డిమాండ్లలో 98 శాతం ఆమోదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యార్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. నిరసనల్లో భాగంగా ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహ్తో, సోమవారం నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మరోవైపు, ఈ నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) సభ్యులు అజీతా భట్టాచార్య, అనిమా హన్సా, జమాల్ అహ్మద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీఐడీ వీరిని విచారణకు పిలవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసెంబ్లీ పరిసరాల్లో 750 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించడంతో పాటు, రాంచీ వ్యాప్తంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం, విద్యార్థుల మధ్య పట్టువీడని ధోరణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement