సాక్షి,విజయవాడ:రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు మరో 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
విజయవాడ ముత్యాలంపాడులో వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుతంగా ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరంపై బోండా ఉమా తన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారు. దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి రౌడీయిజానికి పాల్పడిన బోండా ఉమాపై,ఆయన అనుచరులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కూటమి నేతల్ని వదిలేసి బాధిత వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
డీఎస్సీ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై తాము పారదర్శకమైన చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన నేతలు, ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతున్నారు. చర్చకు రావాల్సిందిగా తాము సవాల్ విసురుతున్నా మంత్రి నారా లోకేష్ ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఈ సందర్భంగా గట్టిగా నిలదీశారు.


