పెడన: కృష్ణా జిల్లా పెడన మండలంలోని బల్లిపర్రు గ్రామంలో ఉన్న ఓ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడం, వారిని గుర్తించిన పోలీసులు క్షేమంగా విద్యా సంస్థకు చేర్చడంతో కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. పోలీసుల విచారణలో ఈ అదృశ్యం వెనుక ఇద్దరు యువకుల ప్రమేయం ఉందని, వారు బాలికలపై లైంగికదాడి చేసినట్లు తేలింది. దీంతో వారిపై పోక్సో, లైంగికదాడి కేసులను శనివారం నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు..
ఈ నెల ఆరో తేదీన పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు మచిలీపట్నంలోని కోనేరుసెంటరుకు చేరుకున్నారు. అనంతరం బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మద్దాల శ్యామ్‌కిరణ్‌కు ఫోన్ చేశారు. బాలికల విషయం తెలుసుకున్న శ్యామ్‌కిరణ్ శారదానగర్‌కు చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ కొక్కిలిగడ్డ సిద్దును వెంటతీసుకువెళ్లాడు. కోనేరుసెంటరులో ఉన్న ఇద్దరు బాలికలను వారిద్దరూ ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరం గ్రామంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక ప్లాట్‌లోకి బాలికలను తీసుకువెళ్లి ఇరువురు యువకులు వారిపై లైంగికదాడికి పాల్పడ్డారు.
అనంతరం బాలికలను రుద్రవరం తీసుకెళ్లి ఒక బాలిక ఇంటి సమీపంలో వారిని విడిచిపెట్టారు. మరుసటి రోజు ఒక బాలిక అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిలదీయగా ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు బాలికను తీసుకుని పోలీసులకు వద్దకు వెళ్లారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లపై పోక్సో, లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు పెడన పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వారు పేర్కొన్నారు.
చదవండి: ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్


