‘కనీసం’పై బ్యాంకులు భారీ వడ్డన | Banks impose heavy fines on minimum balance | Sakshi
Sakshi News home page

‘కనీసం’పై బ్యాంకులు భారీ వడ్డన

Aug 9 2026 5:56 AM | Updated on Aug 9 2026 5:56 AM

Banks impose heavy fines on minimum balance

మినిమం బ్యాలెన్స్‌ లేదంటూ ఖాతాదారుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు

గత ఐదేళ్లలో ఏకంగా రూ.27,881.84 కోట్లు వసూలు 

మధ్యతరగతి పరిమిత గృహ పొదుపుపై తీవ్ర ప్రభావం 

గత నాలుగేళ్లలో ప్రైవేట్‌ బ్యాంకుల వసూళ్లు రూ.15,848.45 కోట్లు  

సాక్షి, అమరావతి: పొదుపు, కరెంటు, ఖాతాల్లో కనీస నిల్వ లేదంటూ బ్యాంకులు ఖాతాదారుల నడ్డి విరుస్తున్నాయి. ఈ చార్జీలు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జీరో బ్యాలెన్స్‌ పొదుపు ఖాతాలైన ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన కింద తెరిచిన ఖాతాలకు కనీస నిల్వ చార్జీలు వర్తించవు. ఇక మిగతా పొదుపు, కరెంటు ఖాతాదారులు నెలవారీ కనీస నిల్వ నిర్వహించకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు భారీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. 

గత ఐదేళ్లలో దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కలిసి కనీస నిల్వ నిర్వహించనందుకు చార్జీల రూపంలో ఏకంగా రూ.27,881.84 కోట్లను వసూలు చేశాయి. బ్యాంకులు ఈ చార్జీలను నిర్వహణ అవసరాలుగా సమర్థించు కుంటున్నప్పటికీ మధ్యతరగతి పరిమిత గృహ పొదుపును హరించివేసి, వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 

రూ.12,033.39 కోట్లు వసూలు 
» గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస నిల్వ నిర్వహించని ఖాతాల నుంచి చార్జీల రూపంలో రూ.12,033.39 కోట్లు వసూలు చేశాయి. అలాగే గత నాలుగేళ్లలో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు రూ.15,848.45 కోట్లు వసూలు చేశాయి. 
»   ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గత ఐదేళ్లలో అత్యధికంగా కనీస నిల్వ నిర్వహించనందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అత్యధికంగా రూ.2027.94 కోట్లు  వసూలు చేసింది. ఆ తరువాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.1896.38 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ.1776.85 కోట్లు వసూలు చేసింది. 

ఎస్‌బీఐ కరెంట్‌ ఖాతాలపై .... 
» స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పొదుపు ఖాతాలపై కనీస నిల్వ చార్జీలను ఎత్తివేసినప్పటికీ కరెంటు ఖాతాలపై వసూలు చేస్తోంది. గత ఐదేళ్లలో రూ.1600.77 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ గత నాలుగేళ్లలో అత్యధికంగా రూ.5669.91 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.3787.30 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1578.29 కోట్లు, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ రూ.998.41 కోట్లు వసూలు చేసింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement