నెల్లూరు సిటీలో రిలే దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, న్యాయవాదులు
కట్టడిని ఎదుర్కొంటూ కదంతొక్కిన యువత
దగా డీఎస్సీపై మూడో రోజూ దీక్షలు విజయవంతం
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పోలీసుల బెదిరింపులు
వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలపై ఖాకీలను ఉసిగొల్పిన చంద్రబాబు ప్రభుత్వం
కుమారుడు లోకేశ్ భవితవ్యంపై నీలినీడలు అలుముకుంటున్నాయని భయం
టెంట్లు పీకేయాలని, నేతలను లాక్కెళ్లాలని ఆదేశం
ఫలితంగా పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన పోలీసులు
చిలకలూరిపేటలో దౌర్జన్యం.. కిందపడిపోయిన మాజీ మంత్రి రజిని
జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో దీక్ష అడ్డగింత
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న వైనం
బాపట్లలో క్యారమ్స్ ఆడుతూ వినూత్న నిరసన
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా వైఎస్సార్‌సీపీ అడుగులు
రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి : మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని, డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలపై మూడవ రోజు శనివారం కూడా చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. అయినప్పటికీ ఎక్కడికక్కడ దీక్షలు విజయవంతం కావడం, జెన్ జీ యువత కదం తొక్కడంతో రోజురోజుకు ఉద్యమం ఉధృతం అవుతోంది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుట్టింది. డీఎస్సీ అక్రమాలపై జెన్ జీ యువత, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. తన తనయుడి రాజకీయ భవితపై బెంబేలెత్తుతూ ఇప్పటికే పోలీసులు, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి రిలే దీక్షల భగ్నానికి విఫలయత్నం చేస్తున్నారు.
అడ్డంకులను అధిగమించి ఉధృతంగా పోరు
డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తాయి. వేలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, జెన్‌జీ యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీక్షా శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు, టీడీపీ శ్రేణుల అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలను కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు.. స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్ దీక్షా శిబిరాల్లో విన్పించింది. యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జెన్ జీ యువత మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని యువత ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. రోజురోజుకూ ఉద్యమానికి యువత మద్దతు పెరుగుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన తీవ్రమైంది.
చిలకలూరిపేటలో పోలీసుల దౌర్జన్యం
చిలకలూరిపేటలో రిలే దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యం చేశారు. దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. అంతలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు ప్రయత్నించడంతో రజిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో విడదల రజిని కిందపడిపోయారు. మహిళా నేత అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ నేతల ఒత్తిడితో రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలను అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది సరికాదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిలదీయడంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. రామసుబ్బారెడ్డిని తరలించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది.
క్యారమ్స్ ఆడుతాం.. మాకూ ఉద్యోగాలివ్వండి
బాపట్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన నిర్వహించారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో పేకాట, లూడో ప్రామాణికంగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని వినూత్న నిరసన చేపట్టడం ప్రజలను ఆలోచింపజేసింది. రిలే దీక్షా శిబిరం వద్ద క్యారం బోర్డు ఆడుతూ.. ‘మాకు కూడా డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు సర్కారు కుటిలయత్నాలు, కుట్రలను అధిగమించి వైఎస్సార్‌సీపీ శనివారం మూడవ రోజు రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.

సంతలో సరుకుల్లా డీఎస్సీ కొలువులు
⇒ కూరగాయల బుట్టల్లో పోస్టుల విక్రయాల నాటిక
⇒ క్రీడా కోటాకు ‘తొక్కుడు బిళ్ల’ ఆటలతో వినూత్న నిరసన
పార్వతీపురం రూరల్: పార్వతీపురం వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో మహిళలు, జెన్–జి యువత వినూత్న రీతిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. డీఎస్సీ టీచర్ పోస్టులను కూటమి నాయకులు అంగడిలో సరుకుల్లా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ దీక్షా శిబిరం వద్ద మహిళలు ప్రదర్శించిన నాటికలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
కూరగాయల బుట్టల్లో ‘ఎస్‌జీటీ పోస్టు’, ‘సూ్కల్ అసిస్టెంట్ పోస్టు’ అని బోర్డులు ఉంచి.. ‘రండి బాబు రండి.. రేటు మాట్లాడితే ఉద్యోగం మీదే.. చదువుతో పనిలేదు, డబ్బులిస్తే చాలు’ అంటూ వీధి వ్యాపారుల్లా అరుస్తూ నిరసన తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు పోస్టులు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ.. మహిళలు ‘తొక్కుడు బిళ్ల’ ఆడుతూ, వీధి ఆటలను కూడా కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో చేర్చే అవకాశం ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


