వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన మండిపాటు
సీఎం చంద్రబాబు విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టు అబద్ధాల పుట్ట
రైతులు, మహిళలు, యువత జీవితాల్లో మార్పు లేకుండా ప్రోగ్రెస్ ఎలా సాధ్యం?
పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమంపై వాస్తవాలు చెప్పే ధైర్యం మీకుందా?
పార్లమెంట్‌లో కేంద్రం సమాధానంతో మీ బండారం బట్టబయలు
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పచ్చి అబద్ధాల పుట్ట అని.. వైట్ పేపర్లు, ప్రోగ్రెస్ రిపోర్టుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్ అని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఆధారాలతో తిప్పికొట్టారు. శనివారం బుగ్గన హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు.
‘పంటలకు మద్దతు ధర లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. ఉచిత పంటల బీమా బంద్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500 ఎవరికిచ్చారు? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఎవరికైనా ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఏమైంది? మీ పాలనలో ప్రోగ్రెస్ తెలుసుకోవాలంటే ఒక సామాన్యుడిని అడిగితే చాలు. ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్యం అందడం కూడా ఇబ్బందిగా మారింది. రైతులు, యువత, మహిళల జీవితంలో మార్పు కనిపించకుండా ప్రోగ్రెస్ ఎలా వచ్చింది?’ అని బుగ్గన నిలదీశారు. మామిడి, పొగాకు రైతులు, మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌సీపీ హయాంలోనే సంక్షేమాభివృద్ధి
వైఎస్సార్‌సీపీ హయాంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 1.35 లక్షల యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 10,032 విలేజ్ క్లినిక్స్ నిర్మించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు చేపట్టి, ఐదు పూర్తి చేశాం. రైతుల కోసం 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం.
ఉచిత పంటల బీమా కింద 54.5 లక్షల మంది రైతులకు రూ.8 వేల కోట్లు చెల్లించాం. నాడు–నేడు కింద మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండో దశలో 22,344 ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. రూ.25 వేల కోట్ల ఖర్చుతో 4 నూతన పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. అమ్మ ఒడి ద్వారా రూ.26 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు, చేయూత ద్వారా రూ.20 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.
మీది బూటక ప్రచారం కాదా?
అప్పుల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు, కాగ్ లెక్కల ప్రకారమే 2024 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పు రూ.4.92 లక్షల కోట్లు, గ్యారెంటీలతో కలిపితే రూ.6.47 లక్షల కోట్లు, విద్యుత్ రంగ బకాయిలను కలిపితే సుమారు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు కూడా మా హయాంలో ఏటా రూ.39,500 కోట్ల నుంచి రూ.62,500 కోట్ల వరకు ఉంటే.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో అది రూ.81 వేల కోట్లకు చేరింది. మా హయాంలో స్థూల ఉత్పత్తి వృద్ధి ఎక్కువ. పెట్టుబడులు, ఉద్యోగాలపై కూడా తప్పుడు ప్రచారమే. పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన సమాధానమే మీ బూటకపు ప్రచారాన్ని వెల్లడిస్తోంది. అమరావతిలో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సమాధానం చెప్పాలి’ అని బుగ్గన మండిపడ్డారు.


