పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి దుండగుల ఘాతుకం
చిత్తూరు జిల్లాలో ఘటన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి, పనిమనిషిని గొంతుకోసి హతమార్చడమే కాకుండా నాటు బాంబులతో కలకలం సృష్టించారు.
బీఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐ మణికంఠేశ్వర్‌రెడ్డి కథనం ప్రకారం.. మంగాపురం గ్రామానికి చెందిన పట్టాభినాయుడు అమెరికాలో ఉంటున్నారు.ఆ ఇంట్లో ఆయన సోదరి, ఆమె భర్తతోపాటు పనిమనిషి ఆనందరావు(50) ఉంటున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన ఆనందరావు ఇక్కడ 11ఏళ్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు, ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కలకు మత్తుమందు ఇచ్చి అచేతనంగా మార్చారు. ఆ తర్వాత ఇంట్లో ఆనందరావును అడ్డగించి గొంతు కోసి హత్య చేశారు.
నాటు బాంబుల మోత...
హత్య అనంతరం దుండగులు ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసేందుకు నాటు బాంబులను పేల్చారు. పెద్ద ఎత్తున బాంబు పేలుడు శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు అరుపులు కేకలు పెట్టారు. దీంతో గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఘటన స్థలంతో పాటు రోడ్డులో రెండు నాటు బాంబులను స్వాదీనం చేసుకున్నారు. ఆనందరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వెల్లువెత్తుతున్న అనుమానాలు
హత్యకు గురైన ఆనందరావు గత 11 ఏళ్లుగా పట్టాభినాయుడు ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్నాడు. యజమాని ఆర్థిక సహాయంతోనే ఆనందరావు తన కుమారుడిని పుత్తూరులోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. ఆనందరావు భార్య, కుమార్తె బాపట్ల జిల్లాలోని సొంత ఊరిలోనే ఉంటున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో బాంబులు పేల్చి మరి హత్యకు పాల్పడడం వెనుక అసలు కారణాలు ఏమిటి? కేవలం పనిమనిషినే లక్ష్యంగా చేసుకుని దాడి చేశారా? లేక ఇంటి యజమానులను భయపెట్టేందుకు ఏమైనా ముఠా పన్నాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


