సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పోలీసుల అదుపులో తిరుపతిరావు
సత్తుపల్లి: పెద్ద మనుషుల సమక్షాన నిర్వహించిన పంచాయితీలో డబ్బులు, బంగారం ఇవ్వాలని తీర్పు రావడంతో కక్ష గట్టిన వ్యక్తి తన అత్త (భార్య తల్లి)ను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, తుమ్మూరుకు చెందిన వెదుళ్ల వెంకటనరసమ్మ(60) పెద్ద కూతురు మంగకు తిరుపతిరావుతో 30 ఏళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలానికి తిరుపతిరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. మంగకు చెందిన బంగారం, రూ.50 వేల నగదును తిరుపతి ఆ మహిళకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై మంగ, నరసమ్మ పెద్ద మనుషుల వద్ద ఈనెల 1వ తేదీన పంచాయితీ పెట్టించగా, ఆరు నెలల్లో నగదు, బంగారం తిరిగి ఇవ్వాలని పంచాయితీలో తీర్పు చెప్పినట్లు సమాచారం.
ఆ రెండో రోజే హత్య
తిరుపతిరావు పంచాయితీ జరిగిన రెండో రోజే హత్య చేసినట్లు తెలిసింది. తల్లి కనిపించడం లేదని మంగ పోలీసులకు ఫిర్యాదు చేసింది, పోలీసులు విచారించగా సెల్‌ఫోన్ చార్జింగ్ వైర్ నరసమ్మ మెడకు బిగించి హత్య చేసి, నారాయణపురం – బేతుపల్లి మధ్య రోడ్డు పక్కన తోటలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు తిరుపతిరావు ఒప్పుకున్నాడు. పోలీసులు శనివారం ఘటనాస్థలి నుంచి ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తిరుపతిరావును, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో మరెవరైనా పాల్గొన్నారా, మృతదేహాన్ని నారాయణపురం తరలించడానికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి దర్యాప్తు మొదలుపెట్టారు.
భార్యతో గొడవపడి.. ఇంటికి నిప్పు పెట్టిన భర్త
పక్కింటికి కూడా వ్యాపించిన మంటలు
నవీపేట: భార్యతో గొడవపడిన వ్యక్తి.. మద్యం మత్తులో తన ఇంటికే నిప్పు పెట్టాడు. మంటలు పక్కింటికి కూడా వ్యాపించడంతో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మోకన్‌పల్లి గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి (వీఆర్‌ఏ) అల్లం సురేశ్ తరచూ భార్య ఉమతో గొడవపడేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పంచాయితీపెట్టి రాజీ కుదిర్చారు. తాగుడుకు బానిసైన సురేశ్.. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు.
అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ భార్యను కొట్టడంతో.. విషయం తెలుసుకున్న పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. మద్యం మత్తులో తెల్లవారే వరకు కేకలు వేసిన సురేశ్.. శనివారం ఉదయం అదే మత్తులో పెట్రోల్ పోసి ఇంటి పైకప్పుకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లోని వస్తువులు కాలిబూడి దయ్యాయని, రూ. లక్ష మేర ఆస్తినష్టం జరిగిందని సాయిబాబా తెలిపారు. సాయిబాబా ఫిర్యాదు మేరకు సురేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


