కిరీటాల తయారీకి ‘టెండర్‌’! | Devotees are demanding that the goddess be crowned soon | Sakshi
Sakshi News home page

కిరీటాల తయారీకి ‘టెండర్‌’!

Aug 9 2026 4:29 AM | Updated on Aug 9 2026 4:29 AM

Devotees are demanding that the goddess be crowned soon

కొమురవెల్లి అమ్మవార్లకు స్వర్ణ కిరీటాల యోగమెప్పుడు 

తయారీ టెండర్లకు ఆహ్వానం 

ఆరు నెలలుగా బిడ్‌ తెరవకుండా సలహాదారు ఆటంకాలు 

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో స్వామితో పాటు చెంత ఉండే సతీమణులు మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు స్వర్ణ కిరీటాలు చేయించే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. భక్తులు సమర్పించిన బంగారంతో కిరీటాలు తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. టెండర్లు ఖరారు కాలేదు. దీంతో కిరీటాల తయారీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. భక్తులు సమర్పించిన బంగారమే అయినప్పుడు.. టెండర్ల ఖరారులో ఎందుకు జాప్యం చేస్తున్నారని భక్తులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సీఎం, మంత్రులు దృష్టి సారించి అమ్మవార్లకు త్వరగా కిరీటాలు చేయించాలని భక్తులు కోరుతున్నారు. 

2023లో బంగారు కిరీటాలు చేయించాలని.. 
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాది మంది వస్తుంటారు. మల్లికార్జున స్వామికి స్వర్ణకిరీటాన్ని గతంలోనే తయారు చేసి స్వామి వారికి అలంకరించారు. మల్లన్నకు ఇరువైపులా మేడలా దేవి, కేతమ్మలు కొలువై ఉన్నారు. దేవతామూర్తుల విగ్రహాలకు అభరణాలు అలంకరించడం లేదు. 

కేవలం బంగారు పుస్తెలు మాత్రమే ఉన్నాయి. నిత్యం పూలమాలలు మాత్రమే అలంకరిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో జరిగిన స్వామి వారి కళ్యాణం సందర్భంగా మేడలమ్మ, కేతమ్మలకు స్వర్ణ కిరీటం చేయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. భక్తులు సమర్పించిన బంగారం, బాండ్లతో కలిపి దాదాపు 7 కిలోలుండగా.. అందులో నుంచి 2.5 కిలోలతో రెండు బంగారు కిరీటాలు చేయించాలని నిర్ణయించారు.  

టెండర్‌ తెరిచేందుకు సలహాదారు ఆటంకం 
బంగారు కిరీటాల తయారీ సంస్థల నుంచి 7 జనవరి 2026 నుంచి 21 జనవరి 2026 వరకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించారు. దాదాపు రెండు సంస్థలు టెండర్లలో పాల్గొన్నట్లు సమాచారం. దేవాదాయ శాఖకు చెందిన ధార్మిక సంస్థ ఓ సలహాదారు బంధువులకు చెందిన సంస్థ సైతం టెండర్‌ వేసింది. ఆ సంస్థ పూర్తి స్థాయిలో పేపర్లను అప్‌లోడ్‌ చేయలేదు. దీంతో టెండర్‌ బిడ్‌ ఓపెన్‌ చేస్తే ఆ సంస్థకు దక్కదన్న ఉద్దేశంతో అడ్డుపడుతున్నట్లు తెలిసింది. ఆరు నెలలుగా బిడ్‌ తెరవకపోవడంతో.. తయారీ సంస్థ ఇంకా ఖరారు కాలేదు. రెండున్నరేళ్ల క్రితం మంత్రి సురేఖ ఇచి్చన హామీ నేటికి నెరవేరడం లేదు. త్వరగా బిడ్‌ను తెరిచి బంగారు కిరీటాలు తయారు చేపించి అమ్మవార్లకు అలంకరించాలని భక్తులు కోరుతున్నారు. 

టెండర్‌ దశలోనే ఉంది 
అమ్మవార్లకు బంగారు కిరీటాల తయారీ ప్రక్రియ టెండర్ల దశలోనే ఉంది. టెండర్లు ఖరారు కాగానే కిరీటాల తయారీ ప్రారంభమవుతుంది. ఈసారి స్వామి వారి కల్యాణం లోగా తయారు చేయించి అమ్మవార్లకు అలంకరిస్తాం.  –కట్ట సుధాకర్‌ రెడ్డి, ఈవో,  కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement