ఆటో బోల్తాపడి ఒకరి మృతి
బాధిత కుటుంబానికి రూ.6 లక్షలు చెల్లించాలన్న గ్రామస్తులు
డబ్బుల్లేవని ఆటో డ్రైవర్ దంపతుల ఆత్మహత్యాయత్నం
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా రూ.6 లక్షలు ఇవ్వాలని గ్రామస్తులు ఒత్తిడి తేవడంతో ఆటో డ్రైవర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. వివరాలివి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కురి్మండ్ల శ్రీనివాస్ గౌడ్ ఆటో డ్రైవర్. జూన్ 25న రామాయంపేటనుంచి వస్తుండగా ఆటోను లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల రమేష్ గౌడ్ మరణించాడు. దీనిపై పంచాయితీ చేసిన గ్రామస్తులు.. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల జరిమానా విధించారు.
శ్రీనివాస్‌గౌడ్ లక్ష రూపాయలు చెల్లించి మిగతా రూ.5 లక్షలకు తన బావ అయిన సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన సిద్దగౌడ్‌ను జమానత్‌గా ఉంచాడు. వాయిదా సమయం దాటినా డబ్బులు ఇవ్వకపోవడంతో.. మృతుడు రమేశ్ కుటుంబ సభ్యులను అతని బంధువు తీసుకెళ్లి జమానత్‌గా ఉన్న సిద్దగౌడ్ ఇంటి వద్ద వదిలాడు. ఈ క్రమంలో సిద్దగౌడ్ భార్య సత్తవ్వ మనస్తాపానికి గురై కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో గ్రామస్తులు కల్పించుకుని తిరిగి పంచాయితీ నిర్వహించి రూ.3 లక్షలను చెల్లించాలని శ్రీనివాస్‌గౌడ్‌కు సూచించారు.
అంత డబ్బు తమ వద్ద లేదని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొనగా.. జరిమానా చెల్లించాల్సిందేనని గ్రామస్తులు ఆదేశించారు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ అతడి భార్య లత మనస్తాపం చెంది ఇంటికి వెళ్లి పురుగు మందు తాగారు. స్థానికులు గమనించి వారిని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని భిక్కనూరు ఎస్‌ఐ అనిల్ తెలిపారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాస్‌గౌడ్ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు.


