ఆబ్కారీలో డీసీల నుంచి సీఐల వరకు బదిలీల కోసం భారీ స్థాయిలో ఆమ్యామ్యాలు
ఒక్కో పోస్టుకు లక్షల్లో ముడుపులు..కావాల్సిన పోస్టు కోసం ముట్టచెపుతున్న అధికారులు!
ఓ కీలక మంత్రి పేషీపై ఆరోపణలు.. చక్రం తిప్పుతున్న సన్నిహితుడు!
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బదిలీల కోసం అడ్వాన్సు చెల్లింపులు?.. మంత్రి పేషీ నుంచి ఓ జాబితా.. కమిషనరేట్‌లో మరో జాబితా రెడీ
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలకు ఆబ్కారీ శాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గుట్టు చప్పుడు కాకుండా మైక్రో బ్రూవరీలకు అనుమతుల మంజూరు, హాలోగ్రామ్ టెండర్ దశాబ్దాల పాటు కొనసాగించడంపై ఓ వైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు ఆ శాఖ ఉన్నతాధికారుల బదిలీల విషయంలోనూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తుండటం గమనార్హం. ఇటీవల జరిగిన డిప్యూటీ కమిషనర్ (డీసీ), అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ), ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్)ల బదిలీ వ్యవహారంలో భారీయెత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక త్వరలో జరగాల్సిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్), సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ), సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) బదిలీల విషయంలో ఇప్పటికే ఈ అవినీతి తంతు కొనసాగిందనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. ఒక్కో పోస్టుకు స్థాయిని బట్టి రూ.10–25 లక్షల వరకు వసూలు చేశారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అన్ని వేళ్లూ..ఓ కీలక మంత్రి పేషీ వైపు, ఆ పేషీలో చాలా కాలంగా పనిచేస్తోన్న ఆయన సన్నిహితుడి వైపు చూపిస్తుండడం గమనార్హం.
మెప్పిస్తేనే నచ్చిన పోస్టింగ్
గత నెలలో ఎక్సైజ్ శాఖ పరిధిలోని 14 మంది డీసీ, 19 మంది ఏసీ, 30 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్ల బదిలీలు జరిగాయి. 18 మంది ఏఈఎస్, 60 మందికి పైగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ)కలిపి మరో 200 వరకు బదిలీలు త్వరలో జరగనున్నాయి. గత నెలలో జరిగిన ఈఎస్, ఆ పైస్థాయి పోస్టింగులు ప్రభుత్వ స్థాయిలో జరిగేవి కావడంతో ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి పేషీ ప్రమేయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పేషీలో దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తోన్న, మంత్రికి సన్నిహితుడైన ఓ వ్యక్తి, మరో ఉన్నతాధికారి సాయంతో అధికారుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కావాల్సిన పోస్టింగుల కోసం ఆయన్ను కలవడం తప్పనిసరని, అలా జరిగితేనే ఈఎస్‌లు, ఆ పైస్థాయిలో పోస్టింగులు లభించాయని ఎక్సైజ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పేషీతో పాటు ఐదారుగురు మంత్రుల సిఫారసులు, పార్టీ అధ్యక్షులతో పైరవీలు కూడా నడిచాయని, కులాలు, పార్టీల వారీగా వెళ్లిమరీ అధికారులు పోస్టింగులు తెచ్చుకున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది.
సీఐల ముందు చూపు
త్వరలో జరగబోయే బదిలీలు కమిషనరేట్ స్థాయిలో జరిగేవి కావడంతో కొంత కంగాళీ ఏర్పడింది. ఈ బదిలీల విషయంలోనూ కీలకమంత్రి పేషీ, ఆయన సన్నిహితుడి జోరు తగ్గలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ జాబితాను ఇప్పటికే కమిషనరేట్‌కు సదరు మంత్రి పేషీ పంపిందని సమాచారం. అయితే కమిషనరేట్ స్థాయిలోనూ మరో జాబితా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితా కోసం ఓ రిటైర్డ్ అధికారితో పాటు ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం నాయకుడొకరు చక్రం తిప్పారని సమాచారం. ఇక స్టేషన్ మొత్తం చేతిలో ఉండే పోస్టింగ్ కావడంతో సీఐలు ముందుచూపుతో ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు అడ్వాన్సు చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాగా ఇప్పుడు జరిగే బదిలీల విషయంలోనూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పైరవీలు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి పేషీ నుంచి వచ్చిన జాబితా ప్రకారం పోస్టింగులు వస్తాయా... కమిషనరేట్‌లో తయారైన జాబితా ప్రకారం పోస్టింగులు వస్తాయా అన్నది ఇప్పుడు ఎక్సైజ్ వర్గాల్లో ఉత్కంఠను కలిగిస్తోంది.
డిమాండ్ ఫుల్లు..కాసుల జల్లు
మద్యం అమ్మేందుకు అనుమతులు మంజూరు కావాలన్నా..లైసెన్సులు రెన్యువల్ కావాలన్నా.. బార్ అండ్ రెస్టారెంట్ అడ్రస్ మారాలన్నా...వైన్‌షాపులు ఏ ఇబ్బంది లేకుండా నడిపించాలన్నా... మద్యం డిపోల్లో నుంచి సరుకు బయటకు రావాలన్నా.. కేసులు పెట్టాలన్నా.. అవే కేసులు మాఫీ చేయాలన్నా.. ఇలా ఆబ్కారీ శాఖలో ఏ పని చేయాలన్నా ఆమ్యామ్యాలు సర్వసాధారణమనేది బహిరంగ రహస్యమే. అందువల్లే ఓ స్థాయి దాటిన అధికారులకు, ఆయా పోస్టింగులకు ఫుల్లు డిమాండ్ ఉంటుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో)గా ఉండే సీఐల నుంచి ఒకట్రెండు జిల్లాలకు ఇన్‌చార్జులుగా పనిచేసే డిప్యూటీ కమిషనర్ల వరకు కాసుల పంట పండే అవకాశం ఉంటుంది. అందులోనూ జీహెచ్‌ఎంసీ పరిధిలో పోస్టింగులంటే యమ గిరాకీ ఉంటుంది. దీంతో ఫోకల్ పోస్టింగులలో పనిచేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నాలు చేయడం సాధారణంగా జరిగేదే.
ప్రతియేటా మద్యం అమ్మకాలతో పాటు శాఖ విస్తృతి కూడా పెరుగుతుండడం, నాలుగైదు ఏళ్ల తర్వాత బదిలీలు జరుగుతుండడం, మళ్లీ ఎప్పుడు బదిలీలు జరుగుతాయోననే స్పష్టత లేకపోవడంతో పెద్ద ఎత్తున ముట్టజెప్పయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు కావాల్సిన పోస్టింగులు తెచ్చుకునేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయతి్నస్తారనే అభిప్రాయం ఉంది. వచ్చే నెలలో బార్ల లైసెన్సుల రెన్యువల్స్ రానుండడం, ఒక్కో రెన్యువల్‌కు ఆరంకెల స్థాయిలో ఆమ్యామాలు వచ్చే అవకాశాలుండడం, ఆ తర్వాత కొన్ని (ఏ4) షాపుల గడువు ఏడాది ముగుస్తున్న సందర్భంగా లభించే ‘లాంఛనాలు’కలగలిపి రాబడే లక్ష్యంగా ఉన్నతస్థాయి పోస్టింగుల కోసం పోటీలు పడుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.


