ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు | Himachal Pradesh Bus Accident, 7 Killed And 11 Injured After Private Bus Plunges Into 100 Foot Gorge In Chamba | Sakshi
Sakshi News home page

ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు

Aug 8 2026 10:32 AM | Updated on Aug 8 2026 11:08 AM

Road Accident In Himachal Pradesh Chamba

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలోని తిస్సా-బైరాగఢ్‌ మార్గంలో శనివారం ఉదయం ఓ ప్రైవేట్‌ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. బస్సు సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

వివరాల మేరకు.. బైరాగఢ్‌-తిస్సా ప్రాంతంలోని చలుంజ్‌ మోడ్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు రహదారి నుంచి అదుపుతప్పి లోయలో పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లోయలో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. మరో 11 మంది గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం కొండలు, లోయలతో కూడిన క్లిష్టమైన భూభాగం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. బస్సు అదుపుతప్పడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం, రహదారి పరిస్థితులు, కొండ ప్రాంతంలోని ప్రమాదకర మలుపులు వంటి అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
 

 చంబా జిల్లాలో కొండ ప్రాంత రహదారులపై వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులపై కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. దీంతో కొండ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా ప్రమాదంపై మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement