లక్నో: మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో గత మూడేళ్లుగా వరుస విషాదాలు అలుముకున్నాయి. ఉమేష్ పాల్ హత్య కేసుతో మొదలైన పోలీసుల ఏరివేత చర్యలు, ఆ తర్వాత అతీక్, ఆయన తమ్ముడు అష్రఫ్‌ల హత్యలు, తాజాగా మరో కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది. గత మూడేళ్ల కాలంలో జరిగిన ఈ పరిణామాలు ఇలా ఉన్నాయి.
ఉమేష్ పాల్ హత్య(ఫిబ్రవరి 24, 2023)
ప్రయాగ్‌రాజ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసు ప్రధాన సాక్షి ఉమేష్ పాల్, ఆయన ఇద్దరు భద్రతా సిబ్బందిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ హత్య కేసులో అతీక్ అహ్మద్, అతని ముఠాపై ప్రధాన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిందితులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించాయి.
వరుస ఎన్‌కౌంటర్లు (ఫిబ్రవరి - ఏప్రిల్ 2023)
ఫిబ్రవరి 27, 2023: ఉమేష్ పాల్ హత్య జరిగిన మూడు రోజులకు నిందితుడు అర్బాజ్‌ను పోలీసులు నెహ్రూ పార్క్ సమీపంలో చుట్టుముట్టారు. పోలీసులపై జరిపిన కాల్పులకు ప్రతిగా జరిగిన ఎదురుకాల్పుల్లో అతను హతమయ్యాడు. ఉమేష్ హత్యలో ఉపయోగించిన కారును అతనే నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు.
మార్చి 6, 2023: ఈ కేసులో మరో నిందితుడైన విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఉమేష్‌పై తొలి కాల్పులు జరిపింది ఇతనే అని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 13, 2023: దాదాపు 50 రోజులు పరారీలో ఉన్న అతీక్ మూడో కుమారుడు అసాద్ అహ్మద్, అతని సహచరుడు గులామ్‌ను ఝాన్సీలో యూపీ ఎస్టీఎఫ్ మట్టుబెట్టింది. అసాద్‌పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఏప్రిల్ 15, 2023: అసాద్ అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత, ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మీడియా ముఖంగా జర్నలిస్టుల వేషంలో వచ్చిన ముగ్గురు దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య చేసిన లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీ సింగ్‌లను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
తాజాగా రోడ్డు ప్రమాదంలో ఆబాన్ మృతి
అతీక్ కుటుంబంపై మృత్యు నీడ ఇంకా వీడలేదు. తాజాగా అతీక్ కుమారుడు ఆబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 2023లో మైనర్లుగా ఉన్న ఆబాన్, ఎహజమ్‌లను బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచగా, ఆ తర్వాత అక్టోబర్ 2023లో వారు విడుదలయ్యారు.
ప్రస్తుతం అతీక్ కుటుంబంలో..
షైస్తా పర్వీన్ (భార్య): ఉమేష్ పాల్ హత్య కేసులో పరారీలో ఉన్నారు.
ఉమర్ అహ్మద్ (పెద్ద కుమారుడు): లక్నో జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
అలీ అహ్మద్ (రెండో కుమారుడు): నైని సెంట్రల్ జైలులో ఉన్నాడు.
ಅసాద్ అహ్మద్ (మూడో కుమారుడు): ఏప్రిల్ 2023లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
ఆబాన్ (నాల్గో కుమారుడు): తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఎహజమ్ (చిన్న కుమారుడు): అక్టోబర్ 2023లో విడుదలైన తర్వాత తన మేనత్త సంరక్షణలో ఉంటున్నాడు. కాగా గత మూడేళ్లలో జరిగిన వరుస పరిణామాలు, పోలీసుల చర్యలు, హత్యలు, ప్రమాదాల కారణంగా అతీక్ అహ్మద్ సామ్రాజ్యం, అతని కుటుంబం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.
ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..


