విజయ్‌ బిగ్‌ ప్లాన్‌.. షాకిచ్చిన ప్రత్యర్థులు! వాట్‌ నెక్స్ట్‌? | Vijay Big Move Faces a Setback: Rivals Skip What’s Next | Sakshi
Sakshi News home page

విజయ్‌ బిగ్‌ ప్లాన్‌.. షాకిచ్చిన ప్రత్యర్థులు! వాట్‌ నెక్స్ట్‌?

Aug 8 2026 8:11 AM | Updated on Aug 8 2026 8:25 AM

Vijay Big Move Faces a Setback: Rivals Skip What’s Next

తమిళనాడు గొంతును ఢిల్లీ వరకు వినిపించేందుకు ముఖ్యమంత్రి విజయ్‌ చేసిన ప్రయత్నానికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీంతో తమిళనాడులో ఐక్య పోరాటానికి విజయ్‌ చేసిన ప్రయత్నం ప్రారంభంలోనే రాజకీయ విభేదాలను ఎదుర్కొంటోంది.

కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై చర్చించేందుకు తమిళనాడు ఎంపీలతో ముఖ్యమంత్రి విజయ్‌ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఆహ్వానిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీ భేదాలను పక్కన పెట్టి ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు.

డీలిమిటేషన్‌ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమిళనాడు నుంచి ఏకాభిప్రాయంతో కూడిన వైఖరిని రూపొందించాలన్నది విజయ్‌ లక్ష్యంగా కనిపించింది. అయితే..

డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరణ
విజయ్‌ ప్రయత్నాలకు మొదటి దశలోనే అడ్డంకి ఎదురైంది. తమిళనాడులో కీలక రాజకీయ శక్తులైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటించాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ సభ్యులను కలిగి ఉన్న డీఎంకే గైర్హాజరు కావడం విజయ్‌ సమావేశానికి పెద్ద లోటుగా మారింది. అన్నాడీఎంకే కూడా దూరం కావడంతో తమిళనాడులోని ప్రధాన పార్టీల మధ్య డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదని స్పష్టమైంది.

డీలిమిటేషన్‌ ఎందుకు వివాదం?
కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్‌ ప్రక్రియలో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం ఉంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను సుమారు 850 వరకు పెంచే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఈ విధానం నష్టం చేస్తుందని వాటి వాదన. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్‌ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తమిళనాడు భయం ఇదే..
ప్రస్తుతం తమిళనాడుకు లోక్‌సభలో 39 స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన కొత్త లెక్కలు అమలు చేస్తే రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీలు చెబుతున్నాయి. కేవలం ఎంపీ స్థానాలే కాకుండా.. కేంద్ర నిధుల కేటాయింపులు, పన్నుల పంపిణీ వంటి అంశాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల మాట బలహీనపడే అవకాశం ఉందన్నది వాటి ప్రధాన వాదన.

డీఎంకే వైఖరిపై స్పష్టత
ఇటీవల డీలిమిటేషన్‌ అంశంలో డీఎంకే వైఖరి మారిందన్న ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్‌ స్పందిస్తూ.. డీఎంకే మొదటి నుంచీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తోందని, భవిష్యత్‌లోనూ అదే వైఖరితో ఉంటుందని స్పష్టం చేశారు. 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించాలని, అన్ని రాష్ట్రాలకు సమానంగా స్థానాలు పెంచాలని డీఎంకే డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రాల వారీగా కొత్తగా ఎన్ని స్థానాలు వస్తాయో ముందుగానే ప్రకటించాలని కోరుతోంది.

విజయ్‌కు బిగ్‌ టెస్ట్‌
ఇటీవలే రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న విజయ్‌కు డీలిమిటేషన్‌ అంశం కీలక పరీక్షగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అన్ని పార్టీలను కలుపుకోవాలన్న ఆయన ప్రయత్నం ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ప్రధాన పార్టీల గైర్హాజరు ఆయన ముందున్న రాజకీయ సవాళ్లను బయటపెట్టింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు తరఫున ఒకే గొంతుక వినిపించాలని విజయ్‌ ప్రయత్నిస్తున్న వేళ.. డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో తమిళనాడు గళం ఎంత బలంగా వినిపిస్తుందన్నది ఇకపై జరిగే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement