1200 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ.. సీఎం విజయ్ సముద్రం చూసేందుకేనా!? | cm Vijay new secretariate plan faces protest threat from Stalin | Sakshi
Sakshi News home page

1200 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ.. సీఎం విజయ్ సముద్రం చూసేందుకేనా!?

Sep 21 2026 7:17 PM | Updated on Sep 21 2026 7:34 PM

cm Vijay new secretariate plan faces protest threat from Stalin

సాక్షి,చెన్నై: వందేళ్లు గుర్తుండిపోయేలా రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో, 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ-శాసనసభ సముదాయాన్ని నిర్మించాలని సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలోని పట్టినాపక్కంలో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌పై రాజకీయ దుమారం రేగింది. ఈ ప్రతిపాదనను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల ఇళ్లను, వారి జీవనోపాధిని ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ దెబ్బతీస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకార సంఘాలకు డీఎంకే పూర్తి మద్దతు ఇస్తుందని, ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే తాము కూడా ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు.

జ్యోతిష్యుల సలహా మేరకేనా?
ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతంలో కొత్త సచివాలయం అవసరం ఏముందని స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో డీఎంకే ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మించిన ఒమాందూరార్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ స్థలాలు చాలానే ఉన్నాయని గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం సముద్రం వైపు ఉండాలని జ్యోతిష్యులు సలహా ఇవ్వడం వల్లే ప్రభుత్వం పట్టినాపక్కం ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి సముదాయాలు సీఎం పనిచేయడానికి ఉద్దేశించినవే కానీ, సముద్రం వైపు చూస్తూ కూర్చోవడానికి కాదు అంటూ ఆయన  ఎద్దేవా చేశారు.

ట్రాఫిక్,పర్యావరణ సమస్యలు 
ప్రతిపాదిత స్థలం చుట్టూ అనేక పాఠశాలలు ఉన్నాయని, ఇప్పటికే అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. అక్కడ భారీ ప్రభుత్వ సముదాయం వస్తే విద్యార్థులకు, స్థానికులకు నరకం చూపుతుందన్నారు. మరోవైపు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఐ(ఎం) కూడా తీర ప్రాంత పర్యావరణ ముప్పును ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. మిత్రపక్షాల మాటను కూడా లెక్కచేయకుండా టీవీకే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని స్టాలిన్ మండిపడ్డారు.

ప్రభుత్వం క్లారిటీ 
ఈ విమర్శలపై ప్రభుత్వం తరఫున పీడబ్ల్యూడీ మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. ప్రస్తుతం సచివాలయ సముదాయానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపొందించాలని మాత్రమే ఆదేశించామని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : సీఎం విజయ్ ‘ప్రధాని’ కలలు?.. చురకలంటించిన కాంగ్రెస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement