సాక్షి,చెన్నై: తమిళ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం విజయ్‌కు అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే, ఇదే ఉత్సాహంలో తమిళగ వెట్రి కజగం శ్రేణులు ఆయనను ఏకంగా ‘కాబోయే ప్రధాని’ అంటూ ఆకాశానికెత్తేస్తుండటం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. అభిమానంతో అంటున్న మాటలే అయినప్పటికీ, విజయ్ జాతీయ నాయకత్వంపై వస్తున్న ఈ వార్తలు పొత్తు ధర్మాన్ని పాటించే కాంగ్రెస్‌కు అస్సలు మింగుడుపడటం లేదు. రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్ నాయకత్వానికి, టీవీకే శ్రేణుల ‘ప్రధాని జపం’ ఇరకాటంలో పడేసింది.
ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ టీవీకే నేతలకు గట్టిగానే చురకలంటించారు. టీవీకే నాయకులు ఇప్పటికీ తమ పాత ‘ఫ్యాన్ క్లబ్ శైలి’లోనే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అభిమానుల భావోద్వేగాలను, ఆకాంక్షలను ఆపలేమని పేర్కొంటూనే.. ఇప్పుడే అధికారంలోకి వచ్చిన విజయ్, కమిషన్ల ప్రమేయం లేకుండా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తూ మంచి సీఎంగా ఎదిగే దిశగా దృష్టి సారించాలని హితవు పలికారు.
సీఎం విజయ్‌తో మాణిక్యం ఠాగూర్ భేటీ
ఈ ప్రధాని వివాదం, పొత్తులో విభేదాలు వస్తున్నాయనే ఊహాగానాల నడుమ.. మాణిక్యం ఠాగూర్ తమిళనాడు సచివాలయంలో సీఎం విజయ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతినకుండా, పొత్తు ధర్మాన్ని కాపాడుకోవడంపైనే ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
తూత్తుకుడితో సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో టీవీకే నాయకులు విజయ్‌ను భవిష్యత్ ప్రధానిగా అభివర్ణిస్తూ పోస్టర్లు వేయడం కలకలం రేపింది. దీనికి తోడు టీవీకే నేత ఆధవ్ అర్జున్, దేవాదాయ శాఖ మంత్రి శరత్‌కుమార్‌లు భవిష్యత్తులో దక్షిణాది నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి ఒకరు ప్రధాని కావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ దుమారానికి మరింత ఆజ్యం పోశాయి.
కాంగ్రెస్ స్పష్టమైన సందేశం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మద్దతుతోనే తమిళనాడులో ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో, మిత్రధర్మాన్ని దాటి విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం చెక్ పెట్టింది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వమే అంతిమమని స్పష్టం చేస్తూనే, విజయ్ ముందుగా రాష్ట్ర పాలనకే ప్రాధాన్యమివ్వాలని హితవు పలికింది.


