స్థలాభావం కారణంగా ఐదు, ఆరో రైల్వే మార్గాల్లో మార్పులకు ఎంఆర్‌వీసీ యోచన
ప్రతిపాదన, అమలుపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు
ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్‌ఎంటీ)–కుర్లా స్టేషన్ల మధ్య నిర్మించనున్న ఐదు, ఆరో లేన్ల ప్రాజెక్టులో స్దలం కొరత కారణంగా భారీ మార్పులు చేయాలని ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎంఆర్‌వీసీ) యోచిస్తోంది. అందుకు సంబంధించిన కొత్త ప్రతిపాదన రూపొందించడం, అధ్యయనం చేసే పనిలో ఎంఆర్‌వీసీ అధికారులు నిమగ్నమయ్యారు.
సీఎస్‌ఎంటీ–పరేల్ స్టేషన్ల మధ్య మసీద్‌బందర్, శ్యాండ్రస్ట్‌రోడ్, బైకళ, చీంచ్‌పోక్లీ, కరీ రోడ్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇందులో భైకళ మినహా మిగత స్టేషన్లలో ఫాస్ట్ మార్గంలో ప్లాట్‌ఫారాలు లేవు. దీంతో కేవలం భైకళ స్టేషన్‌ను మాత్రం భూగర్భంలో నిర్మించాలని ప్రతిపాదించనున్నారు. అధ్యయనం పనులు కోసం జపాన్‌కు చెందిన ఇంజినీర్లను, అలాగే మౌలికసదుపాయాల కోసం ఓ ప్రైవేటు సంస్ధను సలహాదారులుగా నియమించింది. ఇరు కంపెనీలు సాంకేతిక సమస్యలు పరిష్కరించడం తోపాటు ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, భూగర్భ మార్గం, బైకళ స్టేషన్ రూపురేఖలపై మ్యాపును రూపొందిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
జపాన్ సంస్థకు బాధ్యతలు..
సీఎస్‌ఎంటీ–కల్యాణ్ జంక్షన్‌ల మధ్య ఒకప్పుడు నాలుగు రైల్వే లేన్లు ఉండేవి. వీటిలో రెండింటిని స్లో రైళ్లకు, రెండు ఫాస్ట్ రైళ్లకు కేటాయించారు. కానీ దూరప్రాంతాల రైళ్లకు ప్రత్యేకంగా లేన్లు లేకపోవడంతో మూడు, నాలుగో ఫాస్ట్ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు లేన్ల మీదుగా ఇటు లోకల్ రైళ్లు, అటు దూర ప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించడంవల్ల వాటిపై అదనపు భారం పడుతోంది.
కొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం కూడా లేకపోవడంతో దూరప్రాంతాల రైళ్లు నడిపేందుకు ప్రత్యేకంగా ఐదు, ఆరో రైల్వే లేన్లు వేయాలని సుమారు మూడు దశాబ్ధాల కిందటే ప్రతిపాదన సిద్ధమైంది. స్ధలం అనుకూలంగా ఉన్న కుర్లా–కల్యాణ్ మధ్య ఐదు, ఆరో లేన్ల పనులు పూర్తిచేశారు. దీంతో కుర్లా–కల్యాణ్ స్టేషన్ల మధ్య మూడు, నాలుగో రైల్వే లేన్లపై పడుతున్న భారం కొంతమేర తగ్గింది. కానీ సీఎస్‌ఎంటీ–కుర్లా స్టేషన్ల మధ్య స్ధలం లేకపోవడంతో ఈ ప్రతిపాదన గత రెండు దశాబ్ధాలుగా పెండింగులో పడిపోయింది.
సీఎస్‌ఎంటీ–కుర్లా స్టేషన్ల మధ్య 17.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో పరేల్ నుంచి కుర్లా వరకు స్ధలం కొంత అనుకూలంగా ఉంది. కానీ సీఎస్‌ఎంటీ–పరేల్ మధ్య స్ధలం కొరత ప్రధాన సమస్య కావడంతో ఐదు, ఆరో రైల్వే లేన్లు వేయడానికి వీలుపడలేదు. ఇప్పుడు కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులో పెను మార్పులు చేశారు. సీఎస్‌ఎంటీ–పరేల్ మధ్య 7.4 కిలోమీటర్ల దూరం ఉంది.
ఇదీ చదవండి: భావోద్వేగంతో బస్సుకు వీడ్కోలు
ఐదు, ఆరో లేన్లు వేయాలంటే పట్టాలకు అనుకుని అనేక నివాస భవనాలు, వ్యాపార సంస్ధలు, స్కూళ్లు, కాలేజీ భవనాలు అడ్డువస్తున్నాయి. వీరందరికి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించడం రైల్వేకు పెద్ద సవాలుగా మారనుంది. కానీ ఇప్పుడు కొత్తగా నియమించిన జపాన్ ఇంజినీర్లు, ప్రైవేటు సలహదారుల సంస్ధ ఇచ్చే నివేదికపై ఈ ప్రాజెక్టు భవిత ఆదారపడి ఉంది. ఒకవేళ నివేదిక అనుకూలంగా వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ భారాన్ని భరించే ఆర్ధిక స్థోమత ముంబై లోకల్ రైల్వే బోర్డుకు ఉందా అనేది వేచిచూడాల్సిందే.


