ఖాట్మండు: నేపాల్‌లోని రసువా, నువాకోట్ తదితర ప్రాంతాల్లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం జపాన్ ప్రభుత్వం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ముందుకొచ్చాయి. దాదాపు 9.3 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని ఆ దేశానికి అందజేశాయి. ఈ విపత్తు సహాయక సామగ్రిలో దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు, స్లీపింగ్ ప్యాడ్లు, టెంట్లు, మంచినీటి నిల్వకు ఉపయోగపడే పోర్టబుల్ జెర్రీ క్యాన్లు ఉన్నాయి.
ఈ సామగ్రి బుధవారం నేపాల్ చేరుకోగా, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ‘హ్యుమానిటేరియన్ స్టేజింగ్ ఏరియా’లో లాంఛనంగా అప్పగించారు. నేపాల్‌లో జపాన్ రాయబారి మయేదా తోరు.. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ మంత్రి మహాబీర్ పున్‌కు ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో పాటు జైకా నేపాల్ అధికారులు పాల్గొన్నారు. జైకా నేపాల్ చీఫ్ రిప్రజెంటేటివ్ మత్సుజాకి మిజుకి, మంత్రి మహాబీర్ పున్ సంబంధిత పత్రాలను (లెటర్ ఆఫ్ డెలివరీ అండ్ యాక్సెప్టెన్స్) పరస్పరం మార్చుకున్నారు.
విపత్తు వేళ తక్షణ సాయం అందించినందుకు గాను జపాన్, జైకా సంస్థలకు మంత్రి పున్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సామగ్రిని బాధితులకు సకాలంలో, సక్రమంగా పంపిణీ చేసేందుకు సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని జైకా కోరింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జపాన్-నేపాల్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి టెలిఫోన్ చర్చల అనంతరం ఈ సాయం ఖరారైంది. ఆ చర్చల్లో జపాన్ ప్రభుత్వం వరద మృతులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, నేపాల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ అత్యవసర సామగ్రి బాధితుల కష్టాలను తగ్గించి, పునరుద్ధరణ, పునర్నిర్మాణ చర్యలకు దోహదపడుతుందని, ప్రజలు వీలైనంత త్వరగా సాధారణ జీవితం గడపడానికి తోడ్పడుతుందని జపాన్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: ‘సీజేపీ’ మహిళా కార్యకర్తకు ‘బిగ్‌బాస్’లో చాన్స్


