ఇరాన్‌పై అమెరికా నిఘా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌లో ఏం జరుగుతుందో తమకు క్షణక్షణం తెలుసని.. అక్కడి వ్యక్తులు తమ కంటపడకుండా కనీసం బాత్రూమ్‌కు కూడా వెళ్లలేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై మరోసారి దాడి చేయాల్సి వస్తే ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
వైట్‌హౌస్‌లో ఇవాళ విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థలు, సముద్రంలో మైన్లు వేసే సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వాటిని అమెరికా నిఘా వ్యవస్థలు గుర్తించాయని.. నిర్మాణం పూర్తయ్యేలోపే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశామని పేర్కొన్నారు.
‘‘ఇరాన్ నాయకత్వం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది. కానీ, వాళ్లేం చేస్తున్నారో మాకు అంతా కనిపిస్తోంది. వాళ్లు కదలలేరు. ప్రశాంతంగా బాత్రూమ్‌కు కూడా వెళ్లలేరు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలు, అక్కడి కదలికలపై అమెరికా ఎంత విస్తృతంగా నిఘా కొనసాగిస్తుందో చెప్పే క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ రాడార్ వ్యవస్థలు, క్షిపణి సామర్థ్యాలు, హోర్ముజ్ జలసంధి వద్ద సైనిక కార్యకలాపాలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ట్రంప్ భద్రత విషయంలో అమెరికా భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా టర్కీలో చోటుచేసుకున్న ఘటనను చెప్పుకోవచ్చు. ఇరాన్ నుంచి ట్రంప్‌పై ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో.. ఆయన ప్రయాణాన్ని అత్యంత రహస్యంగా మార్చారు. అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఉన్నట్లు బయట ప్రపంచానికి కనిపించినప్పటికీ.. అనంతరం క్యాటరింగ్ వాహనం ద్వారా మరో చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించారు. మీడియా, కొంతమంది సిబ్బందికి కూడా ఆయన అసలు విమానంలో లేరన్న విషయం వెంటనే తెలియలేదు. అంటే.. ట్రంప్ భద్రత కోసం అమెరికా ఎంత స్థాయిలో రహస్య ఆపరేషన్లు నిర్వహించిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
ఇప్పుడు ఇరాన్ కదలికలపై తమ నిఘా సామర్థ్యాన్ని చాటుకునే క్రమంలో ట్రంప్ చేసిన ‘‘బాత్రూమ్‌కు కూడా వెళ్లలేరు’’ వ్యాఖ్యలు.. భద్రతా వ్యవస్థపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
హర్ముజ్ మా ఆధీనంలోనే..
ఇరాన్ ఆంక్షల కారణంగా నెలలుగా తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంపై అమెరికాకు బలమైన నియంత్రణ ఉందని చెప్పారు. ప్రతిరోజూ భారీ మొత్తంలో చమురును తీసుకెళ్లే నౌకలు అక్కడి నుంచి వెళ్తున్నాయని.. అప్పుడప్పుడు ఇరాన్ డ్రోన్లు దాడి చేసినా వాటిని కూల్చివేస్తున్నామని తెలిపారు.
ఇరాన్ సముద్రంలో మైన్లు వేయడానికి ప్రయత్నిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్ వ్యవస్థను సిద్ధం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఆ సామర్థ్యాన్ని అమెరికా దాడుల్లో ధ్వంసం చేశామని పేర్కొన్నారు.
భారీ దాడి.. 18 మంది మృతి
ఇటీవల.. దాదాపు నెల గ్యాప్ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్‌లో కనీసం 18 మంది మృతి చెందగా, 108 మంది గాయపడ్డారని తాజా నివేదికలు చెబుతున్నాయి. హర్ముజ్ సమీపంలోని కుహెస్తక్ ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఏపీ నివేదించింది. అయితే అమెరికా సైన్యం మాత్రం తామేమీ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది.
అమెరికాకు ఇరాన్ దీటైన బదులు
అమెరికా దాడులకు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈ, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాలకు చెందిన లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
‘ఏ క్షణమైనా దాడి చేస్తాం’
ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అవసరమైతే ఇరాన్‌పై ఎప్పుడైనా కొత్త దాడికి దిగేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆ దాడులు భీకరంగా ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజా దాడుల తర్వాత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే ముగిసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. అమెరికా కన్నెర్ర


